విజయ్ పార్టీకి అందుకే మద్దతిస్తున్నాం: కాంగ్రెస్

  • తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకేకు కాంగ్రెస్ మద్దతు
  • లౌకికవాదాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయమని స్పష్టీక‌ర‌ణ‌
  • మాజీ సీఎం కామరాజ్‌ స్ఫూర్తితో విజయ్ పార్టీ పనిచేస్తోందని ప్రశంస
  • మతతత్వ శక్తులను నిలువరించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడి
  • పదవుల కోసం కాకుండా, రాష్ట్ర బాగు కోసమే ఈ నిర్ణయమన్న కాంగ్రెస్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత, ఎమ్మెల్యే ఎస్. రాజేశ్‌కుమార్ గురువారం స్పందించారు. కేవలం తమిళనాడు లౌకికవాద స్వరూపాన్ని కాపాడటం కోసం, రాష్ట్రంలో మతతత్వ శక్తులు బలపడకుండా నిలువరించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య రాజేశ్‌కుమార్ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలను పక్కన పెట్టిందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని రాజకీయ శక్తులు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రజా తీర్పునకు విరుద్ధమైనదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ తమిళనాడు విస్తృత ప్రయోజనాలు, సామాజిక సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. "కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ప్రజాతీర్పును, రాష్ట్ర భవిష్యత్తును పరిగణనలోకి తీసుకునే మా నిర్ణయం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే తమకు పలు రాజకీయ ఆహ్వానాలు వచ్చాయని, అయినా మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా 'ఇండియా' కూటమిలోని లౌకిక శక్తులతోనే కలిసి నడిచామని రాజేష్‌కుమార్ గుర్తుచేశారు. గత ఎన్నికల్లో లౌకిక ప్రగతిశీల కూటమి విజయానికి కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఆరెస్సెస్, మతతత్వ శక్తులకు తమ పార్టీ సైద్ధాంతికంగా ఎప్పటికీ వ్యతిరేకమేనని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా టీవీకే రాజకీయ వైఖరిని కూడా ఆయన ప్రస్తావించారు. విజయ్ నేతృత్వంలోని పార్టీ తమను తాము ఒక లౌకిక ఉద్యమంగా అభివర్ణించుకుందని గుర్తుచేశారు. టీవీకే అధినేత విజయ్, మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్‌ను తన సైద్ధాంతిక స్ఫూర్తిగా బహిరంగంగా ప్రకటించారని, సామాజిక న్యాయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారని రాజేష్ కుమార్ తెలిపారు. "కామరాజర్ ఆదర్శాలను అంగీకరించి, లౌకిక, సామాజిక న్యాయ విలువలకు కట్టుబడిన రాజకీయ ఉద్యమానికి మద్దతివ్వడం ద్వారా తమిళనాడు లౌకిక పునాదులు మరింత బలపడతాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

తమిళనాడులో లౌకిక రాజకీయ శక్తుల ఐక్యతను కాపాడటం, మతతత్వ శక్తులకు ఏమాత్రం రాజకీయ అవకాశం దక్కకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన నొక్కిచెప్పారు. టీవీకేకు ఇచ్చిన మద్దతును ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చూడాలి తప్ప, రాజకీయ అవకాశవాదంగా చూడకూడదని హితవు పలికారు. మతతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Vijay TVK
Tamil Nadu politics
Congress party
Rajesh Kumar
Tamilaga Vettri Kazhagam
Secularism
Social justice
K Kamaraj
C Joseph Vijay
Assembly elections

More Telugu News