అల్జీమర్స్ గుర్తింపు ఇక సులభం.. భారత్‌లో అందుబాటులోకి కొత్త రక్త పరీక్ష!

Alzheimers New Blood Test Now Available in India
  • అల్జీమర్స్ గుర్తింపునకు అందుబాటులోకి కొత్త రక్త పరీక్ష 
  • ప్రముఖ డయాగ్నస్టిక్ సంస్థ మెట్రోపాలిస్ హెల్త్‌కేర్‌లో ప్రారంభం
  • వెన్నుపూస నుంచి ద్రవం తీసే బాధాకరమైన పరీక్షకు ఇది ప్రత్యామ్నాయం
  • వ్యాధి లక్షణాలు కనిపించక ముందే ముందస్తుగా గుర్తించే అవకాశం
అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ ఇకపై మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఈ వ్యాధిని గుర్తించేందుకు భారత్‌లో ఒక కొత్త రక్త పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ డయాగ్నస్టిక్ సంస్థ మెట్రోపాలిస్ హెల్త్‌కేర్, ప్లాస్మా ఆధారిత ఈ స్క్రీనింగ్ పరీక్షను ప్రారంభించింది. దీని ద్వారా కేవలం రక్త నమూనాతోనే అల్జీమర్స్‌కు సంబంధించిన మార్పులను గుర్తించవచ్చు.  

ఇప్పటివరకు అల్జీమర్స్ నిర్ధారణకు క్లినికల్ లక్షణాలు, బ్రెయిన్ ఇమేజింగ్, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (CSF) పరీక్షలపై ఆధారపడాల్సి వచ్చేది. సీఎస్ఎఫ్ పరీక్ష కోసం వెన్నుపూస నుంచి సూదితో ద్రవాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఇది రోగులకు చాలా బాధాకరమైనది, అసౌకర్యమైనది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ కొత్త రక్త పరీక్షను తీసుకొచ్చినట్టు మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ కీర్తి చాధా తెలిపారు. "గతంలో ఇది వెన్నుపూస నుంచి ద్రవాన్ని సేకరించి చేసే పరీక్ష. కానీ ఇప్పుడు ఇది కేవలం సాధారణ రక్త పరీక్ష మాత్రమే. దీనివల్ల పరీక్ష సులభతరం, చవక కావడంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటుంది" అని ఆమె వివరించారు.

ఈ పరీక్ష యొక్క మరో ముఖ్యమైన ప్రయోజనం, వ్యాధి లక్షణాలు బయటపడకముందే మెదడులోని మార్పులను గుర్తించగలగడం. అల్జీమర్స్‌కు కారణమయ్యే అమిలాయిడ్, టౌ వంటి ప్రొటీన్లను ఈ పరీక్ష గుర్తిస్తుంది. "వ్యాధి లక్షణాలు లేనప్పుడు కూడా ఈ పరీక్ష పాజిటివ్‌గా రావచ్చు. కుటుంబ చరిత్ర ఉన్నవారు ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకోవాలనుకుంటే, ఇది మార్పులను పసిగట్టగలదు" అని డాక్టర్ చాధా పేర్కొన్నారు.

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రస్తావించిన డేటా ప్రకారం ఈ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారిలో 91.7 శాతం మందికి అమిలాయిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అలాగే, నెగెటివ్‌గా వచ్చిన వారిలో 97.3% మందికి అమిలాయిడ్ ఆనవాళ్లు లేవని తేలింది.

భారత్‌లో 50 ఏళ్లు పైబడిన వారిలో మతిమరుపు వంటి అల్జీమర్స్ ప్రారంభ లక్షణాలను సాధారణ వృద్ధాప్య సమస్యలుగా భావిస్తుండటంతో వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ కొత్త రక్త పరీక్ష ఒక గొప్ప మార్పునకు నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరీక్షను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని, సుమారు 50-60 మంది రోగులను పరీక్షించామని మెట్రోపాలిస్ తెలిపింది.
Go Back to Shorts
Alzheimer's
Alzheimer's disease
blood test
Metropolis Healthcare
dementia
memory loss
early detection
amyloid
tau protein
India

More Telugu News