ఏపీకి 'క్యారియర్' కిక్.. రూ.1000 కోట్లతో ఏసీల తయారీ ప్లాంట్

  • ఏపీకి మరో భారీ విదేశీ పెట్టుబడి
  • శ్రీసిటీలో ఏసీల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న క్యారియర్
  • రూ.1000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ.. 3000 మందికి ఉపాధి
  • రేపు పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేశ్‌
  • మూడు దశల్లో 2028 నాటికి పూర్తికానున్న ప్రాజెక్ట్
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనర్ (ఏసీ) తయారీ దిగ్గజం 'క్యారియర్' రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో రూ.1000 కోట్ల వ్యయంతో అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రేపు (బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మూడు దశల్లో నిర్మాణం.. 3000 మందికి ఉపాధి
సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ తన నూతన ప్లాంట్‌ను నిర్మించనుంది. మొత్తం రూ.1000 కోట్ల పెట్టుబడిని 2028 నాటికి మూడు దశల్లో పెట్టనుంది. దేశంలో ఏసీలతో పాటు హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC) ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే లక్ష్యంగా ఈ యూనిట్‌ను స్థాపిస్తోంది. అత్యాధునిక మౌలిక వసతులు, స్మార్ట్ తయారీ టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను తీర్చిదిద్దనున్నారు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.

భారత్‌లో కార్యకలాపాల విస్తరణ
అమెరికాకు చెందిన క్యారియర్ సంస్థకు భారత్‌లో ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పటికే హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో ఒక తయారీ యూనిట్‌తో పాటు హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. తాజాగా శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్, దేశంలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు దోహదపడనుంది. వ్యూహాత్మకంగా శ్రీసిటీని ఎంచుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల మార్కెట్‌తో పాటు ఎగుమతులకు కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. ఈ భారీ పరిశ్రమ రాకతో తిరుపతి జిల్లా పారిశ్రామిక ముఖచిత్రం మరింత మారనుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Carrier
Carrier Sri City
Andhra Pradesh Industries
Air Conditioner Manufacturing
Nara Lokesh
Tirupati District
AP Industrial Development
HVAC Products India
Sri City Plant
Job Opportunities AP

More Telugu News