సోషల్ మీడియా రీల్ చూసి 'ఉమ్మెత్త' కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబంలోని నలుగురి పరిస్థితి విషమం!
- అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం గ్రామంలో ఘటన
- ఉమ్మెత్త కూర తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు
- విషమంగా ఉన్న పరిస్థితి
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు ప్రాణాల మీదకు తెస్తాయని అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం గ్రామస్థుల పరిస్థితి నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోను చూసి, ఉమ్మెత్త కూర ఆరోగ్యం అని నమ్మిన ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి అనే నలుగురు... నిన్న ఆ కూర వండుకుని తిన్నారు. తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వైద్యుల హెచ్చరిక ప్రకారం... ఉమ్మెత్త అనేది అత్యంత విషపూరితమైన మొక్క. ఇందులో ఉండే ఆల్కలాయిడ్స్ నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనికి ప్రత్యేకమైన విరుగుడు ఉండదని, శరీరంలో విషం శాతం పెరిగితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమ్మవారి జాతర కోసం హైదరాబాద్ నుండి సొంత ఊరికి వచ్చిన ఈ కుటుంబం, ఇలాంటి చిన్న పొరపాటుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం స్థానికులను కలచివేస్తోంది. ఏవైనా ఆరోగ్య చిట్కాలు పాటించే ముందు అవి వాస్తవమో కాదో సరిచూసుకోవాలని, ముఖ్యంగా తెలియని మొక్కలను ఆహారంగా తీసుకోకూడదని ఈ ఘటన హెచ్చరిస్తోంది.