మద్దతు కావాలంటే విజయ్ రావాల్సిందే... కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు

  • తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే 
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు అవసరం
  • తమ మద్దతు కావాలంటే విజయే వచ్చి అడగాలన్న కార్తి చిదంబరం
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సంచలన విజయం సాధించిన నటుడు విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పొత్తులపై చర్చ మొదలవ్వగా, కాంగ్రెస్ సీనియర్ నేత కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దతు అవసరమైన విజయే ఇతర పార్టీలను సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.

"సాధారణంగా మద్దతు కోరుకునే పార్టీయే ఇతరుల వద్దకు వెళ్తుంది, అంతేగానీ మద్దతు ఇచ్చే పార్టీలు కావు" అని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని, ఆ సంఖ్యను సమీకరించుకోవడం ఆయనకు పెద్ద కష్టం కాబోదని అభిప్రాయపడ్డారు.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు 128 స్థానాలు అవసరం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5, డీఎంకే 59, ఏఐఏడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల రాజకీయాలకు ముగింపు పలకాలనే నినాదంతో విజయ్ ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా యువత ఆయనకు అండగా నిలిచింది. డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పొత్తు పెట్టుకునేది లేదని విజయ్ గతంలోనే చెప్పడంతో కాంగ్రెస్ మద్దతు కీలకంగా మారింది.

విజయ్ పాలన ఎలా ఉంటుందనే ప్రశ్నకు కార్తీ బదులిస్తూ "ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఎలా ఉంటుందో విజయ్ వివరించాలి. ఆయన తన పాలనా నమూనాను ఇంకా ప్రజల ముందు ఉంచలేదు. అయినా ప్రజలు ఆయన్ను విశ్వసించారు" అని పేర్కొన్నారు.  

Vijay
Tamil Nadu politics
Karti Chidambaram
Tamilaga Vettri Kazhagam
TVK party
Tamil Nadu Assembly elections
DMK
AIADMK
political alliances
Tamil Nadu government formation

More Telugu News