సీఎం స్టాలిన్‌కు భారీ షాక్... టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి

MK Stalin Loses to TVK Candidate VS Babu in Kolathur
  • తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం
  • కొళత్తూర్ నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ అనూహ్య ఓటమి
  • నటుడు విజయ్ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం
  • తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది
  • విజయ్‌కు నారా లోకేష్, కాజల్ అభినందనలు
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొళత్తూర్‌లో ఓటమి పాలయ్యారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సృష్టించిన ప్రభంజనంలో డీఎంకే అధినేత ఓటమి చవిచూడటం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

కొళత్తూర్‌లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు... స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 22 రౌండ్ల పాటు ఓట్లు లెక్కించగా.... వీఎస్ బాబుకు 82,997 ఓట్లు పోలయ్యాయి. సీఎం స్టాలిన్ కు 74,202, అన్నాడీఎంకే అభ్యర్థి సంతాన కృష్ణన్ కు 18,430 ఓట్లు లభించాయి. ఈ ఓటమితో డీఎంకే శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. 

మరోవైపు, ఉత్తర చెన్నైలోని రాయపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి, ఓ ఆటో డ్రైవర్ అయిన విజయ్ ధాము సంచలన విజయం సాధించారు. ఇక్కడ ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి. జయకుమార్‌తో పాటు డీఎంకే అభ్యర్థి సుబేర్ ఖాన్‌ను ఆయన ఓడించారు. ఈ గెలుపును క్షేత్రస్థాయి సాధికారతకు ప్రతీకగా, మార్పు కోరుకుంటున్న ప్రజల స్పష్టమైన సందేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

టీవీకే విజయాలపై సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నటి కాజల్ అగర్వాల్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, విజయ్‌కు ఇది అద్భుతమైన విజయమని, ప్రజలతో ఆయనకున్న బలమైన బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా విజయ్‌ను అభినందించారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలు మారుతున్నాయనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. టీవీకే రాకతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కోణం ఆవిష్కృతమైందని, ప్రజల అంచనాలను విజయ్ బాధ్యతతో నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి తన నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా సాగుతున్నారు. ముఖ్యమంత్రి ఓటమి, టీవీకే అనూహ్య విజయాలతో ఈ ఎన్నికలు తమిళనాడులో దశాబ్దాల ద్విముఖ ఆధిపత్యానికి తెరదించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
MK Stalin
Tamil Nadu Elections
TVK Party
Vijay Thalapathy
Kolathur Constituency
VS Babu
DMK
Tamilaga Vettri Kazhagam
Edappadi K Palaniswami
Tamil Nadu Politics

More Telugu News