తమిళనాడులో నిజమైన‌ పీకే జోస్యం .. విజయ్ పార్టీ ప్రభంజనం.. వైరల్ అవుతున్న పాత వీడియో!

Vijay Thalapathy Party Predicted to Win by Prashant Kishor Old Video Viral
  • తమిళనాడు ఎన్నికల ఫలితాలపై వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ జోస్యం
  • ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ పార్టీ గెలుస్తుందని గతంలోనే పీకే అంచనా
  • ప్ర‌స్తుతం విజయ్ పార్టీ టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం
  • డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములకు ఊహించని షాక్
  • విజయ్ పార్టీకి ప్రత్యేక సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్
రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే), తమిళనాడు ఎన్నికల ఫలితాలపై గతంలో చెప్పిన జోస్యం అక్షరాలా నిజమవుతోంది. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తుందని పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో టీవీకే వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండటమే ఇందుకు కారణం.

కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన 'తంతి టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ పార్టీ ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు.. "అస్సలు లేదు. ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అలా ఒంటరిగా బరిలోకి దిగితే, తమిళనాడులో గెలవడానికి వారికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి" అని ధీమాగా బదులిచ్చారు.

"గెలవడానికి మంచి అవకాశం అంటే ఏంటి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలు గెలవగలరా?" అని యాంకర్ ప్రశ్నించగా, "కచ్చితంగా.. ఈ వీడియో క్లిప్‌ను భద్రంగా దాచుకోండి. ఫలితాలు వచ్చినప్పుడు ప్లే చేయండి" అని పీకే సవాల్ విసిరారు. ఇప్పుడు టీవీకే వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో, ఆ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

నటుడు విజయ్ తన రాజకీయ అరంగేట్రం కోసం ప్రశాంత్ కిషోర్‌ను ప్రత్యేక రాజకీయ సలహాదారుగా నియమించుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పీకే వ్యూహాలు, సలహాలు ఎంతో ఉపయోగపడతాయని విజయ్ భావించారు. ఆయన సలహా మేరకే టీవీకే రాష్ట్రంలోని రెండు ప్రధాన కూటములైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో కలవకుండా మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు, పీకే వ్యూహం ఫలించిందనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక రాజకీయ వ్యూహకర్త అంచనా, ఒక నటుడికి ఉన్న ప్రజాదరణ కలిసి తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
Go Back to Shorts
Prashant Kishor
Vijay Thalapathy
Tamil Nadu Elections
TVK Party
Tamilaga Vettri Kazhagam
AIADMK
DMK
Tamil Nadu Politics
Election Prediction

More Telugu News