నోబెల్ బరిలో భారత 'ప్యాడ్‌మ్యాన్'

Arunachalam Muruganantham Nominated for Nobel Prize
  • అతి తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్న అరుణాచలం
  • మహిళల ఆరోగ్య పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన పారిశ్రామికవేత్త
  • నోబెల్ బహుమతికి ఆయన పేరును నామినేట్ చేసిన పుదుచ్చేరి కంటి ఆసుపత్రి డీన్
  • 24 గంటల్లోనే నామినేషన్‌కు ఆమోదం
  • అరుణాచలం జీవితం ఆధారంగా 2018లో ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా
భారతదేశ 'ప్యాడ్‌మ్యాన్'‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కోయంబత్తూరుకు చెందిన పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనందం నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 2026 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతికి తన పేరు నామినేట్ అయినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లను అందుబాటులోకి తెచ్చి, వారి ఆరోగ్య పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు గాను ఆయన ఈ గుర్తింపునకు చేరువయ్యారు.

"మొదట నేను నమ్మలేకపోయాను. పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి డీన్, అక్కడి అమెరికన్ బృందాలు నా పేరును ప్రతిపాదించాయి. 24 గంటల్లోనే నా నామినేషన్ ఆమోదం పొందింది. ఇది నాకు చాలా గర్వంగా ఉంది" అని ఒక వార్తా సంస్థతో మురుగనందం తన సంతోషాన్ని పంచుకున్నారు.

తమిళనాడుకు చెందిన అరుణాచలం జీవితం ఆధారంగానే 2018లో 'ప్యాడ్‌మ్యాన్' చిత్రం తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.

సాధారణంగా నోబెల్ బహుమతి నామినేషన్ల ప్రక్రియ ఎనిమిది నెలల పాటు చాలా క్లిష్టంగా సాగుతుంది. నార్వేకు చెందిన ఐదుగురు సభ్యుల నోబెల్ కమిటీ పలు దశల్లో నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తుంది.  
Go Back to Shorts
Arunachalam Muruganantham
Padman
Nobel Prize
Sanitary Pads
Coimbatore
India
Womens Health
Akshay Kumar
Padman Movie
Social Reform

More Telugu News