కరీంనగర్ లో దొంగల బీభత్సం... కొన్ని నిమిషాల ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నానన్న బండి సంజయ్

  • కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటన
  • దోపిడీ యత్నాన్ని అడ్డుకోవడంతో సిబ్బందిపై దుండగుల దాడి
  • ఈ ఘటనలో సేల్స్ మేనేజర్ సహా పలువురు ఉద్యోగులకు గాయాలు
  • ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
కరీంనగర్‌లోని పీఎంజే జువెలర్స్‌లో జరిగిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొన్ని నిమిషాల ముందే తాను అదే ప్రాంతంలో ఉన్నానని, తన కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం బాధాకరమని ఆయన అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని కరీంనగర్ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే, ఐదుగురు సాయుధ దుండగులు కస్టమర్ల రూపంలో జువెలరీ షాపులోకి ప్రవేశించారు. బంగారు ఆభరణాలు చూపించమని కోరారు. సిబ్బంది నగలు బయటికి తీయగానే, తుపాకులతో బెదిరించి దోపిడీకి యత్నించారు. సిబ్బంది ప్రతిఘటించడంతో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సేల్స్ మేనేజర్‌తో పాటు ఇతర ఉద్యోగులు గాయపడ్డారు.

గాయపడిన సిబ్బందిని, పోలీసు అధికారులను కలిసి వివరాలు తెలుసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ పోలీసులు తక్షణమే స్పందించారని, పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారని వివరించారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Bandi Sanjay
Karimnagar
PMJ Jewellers
Robbery
Telangana
Crime
Shooting
Police Investigation
CCTV Footage
Hyderabad

More Telugu News