‘నా భుజంపై తుపాకీ పెట్టొద్దు’: మంత్రిని నిలదీసిన వైరల్ మహిళ స్పందన

Tina Choudhary Viral Video Dont Use Me as Weapon
  • ముంబై ర్యాలీలో మంత్రిపై అరిచిన మహిళ టీనా చౌదరి స్పందన
  • ఈ ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని పార్టీలకు విజ్ఞప్తి
  • గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతోనే ఆగ్రహం వ్యక్తంచేశానని వెల్లడి
  • మంత్రి గిరీశ్ మహాజన్ జోక్యంతోనే సమస్య పరిష్కారమైందని వివరణ
  • ప్రజా సేవ చేయడమే యూనిఫాం ఉద్దేశమని వ్యాఖ్య
ముంబైలో బీజేపీ ర్యాలీ కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌లో మంత్రి గిరీశ్ మహజన్‌ను నిలదీసి సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళ టీనా చౌదరి.. ఆ ఘటనపై తొలిసారి స్పందించారు. ఈ వివాదాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని కోరారు. "నా భుజంపై తుపాకీ పెట్టి ఎవరినీ లక్ష్యంగా చేసుకోవద్దు" అని కోరుతూ శనివారం ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.

ఏప్రిల్ 21న వర్లీ ప్రాంతంలో జరిగిన ఆ ఘటన గురించి టీనా వివరిస్తూ "నా కూతురిని మ్యూజిక్ క్లాస్ నుంచి తీసుకురావడానికి వెళ్తుండగా, ర్యాలీ వల్ల గంటన్నర పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాను. అక్కడ ఉన్న పోలీసులను ఎంత వేడుకున్నా స్పందించలేదు. వారి దృష్టిని ఆకర్షించేందుకే నీళ్ల బాటిల్‌ను నేలపైకి విసిరాను కానీ, ఎవరి మీదా కాదు" అని స్పష్టం చేశారు.

ఆ సమయంలో మంత్రి గిరీశ్ మహాజన్ మాత్రమే తన సమస్యను అర్థం చేసుకున్నారని టీనా తెలిపారు. "మంత్రి గారు నా మాట విని, వెంటనే అక్కడి బస్సులను తొలగించాలని ఆదేశించారు. ఆయన వల్లే మాకు దారి దొరికింది" అని ఆమె వివరించారు.

ప్రజల పట్ల అన్ని రాజకీయ పార్టీలూ ఒకేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయని టీనా విమర్శించారు. తన తండ్రి సహా కుటుంబంలో 8 మంది  భారత సైన్యంలో పనిచేశారని గుర్తుచేస్తూ "యూనిఫాం ధరించడం అంటే ప్రజా సేవ చేయడమే కానీ, ప్రజలను భయపెట్టడం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, పబ్లిక్‌లో గందరగోళం సృష్టించారని ఆరోపిస్తూ టీనాపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Go Back to Shorts
Tina Choudhary
Girish Mahajan
Mumbai traffic
BJP rally
Viral video
Social media
Public nuisance
Indian Army
Political controversy
Worli

More Telugu News