రేపు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ కోల్‌కతా.. ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలివే

Sunrisers Hyderabad vs Kolkata Traffic Advisory in Uppal
  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్
  • లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్లు, ట్రక్కుల మళ్లింపు
  • రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా రేపు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. మ్యాచ్ ఉండటంతో ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు.

లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్లు, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్ఎంసీ వాహనాలు, జేసీబీలు, ఐషర్ వ్యాన్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లను అటు రాకుండా మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోల్ నుంచి హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట వరకు మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.

ట్రాఫిక్ మళ్లింపు

- ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వచ్చే హెవీ వాహనాలు మెహఫిల్ హోటల్ వద్ద ఉప్పల్ భగాయత్ ప్రవేశద్వారం వద్ద నాగోల్ మీదుగా ఎల్బీనగర్ వైపు మళ్లించబడతాయి.
- ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుని హెచ్ఎండీఏ భగాయత్ - టయోటా యూటర్న్ - బోడుప్పల్ - చెంగిచెర్ల - ఐవోసీఎల్ చెర్లపల్లి - ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.
-  తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హబ్సిగూడ క్రాస్ రోడ్డు వద్ద నాచారం - ఎన్ఎఫ్‌సీ రోటరీ - ఐవోసీఎల్ చర్లపల్లి - ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.
- రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను వీధి నెంబర్ 8 వద్ద హబ్సిగూడ క్రాస్ రోడ్డు - నాచారం - ఎన్ఎఫ్‌సీ రోటరీ - ఐవోసీఎల్ చర్లపల్లి - ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.
- వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలను ఘట్‌కేసర్ ఆర్ఆర్ వద్ద ఓఆర్ఆర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్బీనగర్ - దిల్‌సుఖ్ నగర్ మీదుగా మళ్లిస్తారు.
- హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లే భారీ వాహనాలను ఎల్బీనగర్ - హయత్ నగర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్ మీదుగా వరంగల్ చేరుకోవాలి.

పార్కింగ్ ప్రదేశాలు

ఈ మ్యాచ్ కోసం ఐదు పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు. వీటిలో నాలుగు స్టేడియం బయట 500 పరిధిలో సాధారణ ప్రజలకు, స్టేడియం లోపల వీవీఐపీ, వీఐపీ పాస్ హోల్డర్లకు ఒక పార్కింగ్ ప్రాంతాన్ని కేటాయించారు.

ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి హబ్సిగూడ వైపు పెంగ్విన్ (1), టీజీఐఏఎల్ఏ (2), ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి రామంతాపూర్ వైపు డీఎస్ఎల్ ఓపెన్ ప్రదేశం (3), మోడర్న్ బేకరీ (4) పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
Sunrisers Hyderabad
SRH
Kolkata Knight Riders
KKR
IPL 2024
Uppal Stadium
Hyderabad Traffic

More Telugu News