క్రమశిక్షణ లేదు.. ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు: రవిబాబు

  • గతంలో రీల్ మీద సినిమా తీస్తున్నప్పుడు అందరూ అంకితభావంతో పని చేసేవారన్న రవిబాబు
  • ఇప్పుడు అంతా డిజిటల్ కావడంతో బాధ్యతారాహిత్యం పెరిగిందని విమర్శ
  • సమయానికి, డబ్బుకు విలువ లేకుండా పోయిందని వ్యాఖ్య

టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు తన తాజా చిత్రం ‘రేజర్’ విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో పెను సంచలనంగా మారాయి. మే 8న తన తండ్రి చలపతిరావు జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న తరుణంలో, ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.


ప్రస్తుత సినిమా నిర్మాణ విధానంపై రవిబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో క్రమశిక్షణ కరవైందని ఆయన ఆరోపించారు. గతంలో ఫిల్మ్ (రీల్) మీద షూటింగ్ చేసేటప్పుడు ప్రతి అడుగు ఎంతో ఖరీదైనదని, అందుకే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో అంకితభావంతో పనిచేసేవారని రవిబాబు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ కావడంతో బాధ్యతారాహిత్యం పెరిగిందని ఆయన మండిపడ్డారు.


"ఇప్పుడు చిప్ తీయడం, డేటా తుడిచేయడం సులభమైపోయింది. దీనివల్ల సమయానికి, డబ్బుకి విలువ లేకుండా పోయింది. సరైన ప్రొడక్షన్ ప్లానింగ్ ఉండటం లేదు. నిజం చెప్పాలంటే, ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒళ్ళు బలిసి తీస్తున్నారు" అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.


రవిబాబు వాడిన ‘ఒళ్ళు బలిసి’ అనే పదంపై సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. నేటి తరం స్టార్ హీరోలను, టెక్నీషియన్లను ఉద్దేశించి ఇలాంటి పదజాలం వాడటం సరికాదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రేజర్’ సినిమాను బహిష్కరించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు, రవిబాబు వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని కొందరు సమర్థిస్తున్నారు. విచ్చలవిడిగా బడ్జెట్ పెంచేస్తూ, క్రమశిక్షణ లేకుండా షూటింగ్‌లు చేయడం వల్ల నిర్మాతలు రోడ్డున పడుతున్నారని, ఆయన అన్నది పచ్చి నిజమని వారు వాదిస్తున్నారు.

Ravibabu
Telugu cinema
Razor movie
Tollywood
Chalapathi Rao
Movie production
Digital technology
Film industry
Movie budget
Production planning

More Telugu News