సహనం కోల్పోయిన కోహ్లీ.. పటీదార్ ఔట్‌పై అంపైర్‌తో వాగ్వివాదం.. వీడియో ఇదిగో!

  • అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ
  • రజత్ పాటిదార్ వివాదాస్పద క్యాచ్ ఔట్‌తో మొదలైన వివాదం
  • ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ ఉత్కంఠ విజయం 
  • పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంపైర్ ఇచ్చిన వివాదాస్పద ఔట్‌పై ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ (19) పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా ఫీల్డర్ జాసన్ హోల్డర్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే, బంతి నేలకు తాకినట్లు రీప్లేలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడి పాటిదార్‌ను ఔట్‌గా ప్రకటించాడు.

ఈ నిర్ణయంపై డగౌట్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక సమయంలో అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కనిపించాడు. అంతకుముందు 13 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటైన కోహ్లీ, ఆ తర్వాత బౌండరీ లైన్ వద్దకు వచ్చి అంపైర్‌తో చాలాసేపు చర్చించడం కెమెరాల్లో రికార్డయింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ కాగా, గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ విజయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా, రాహుల్ తెవాటియా (27*) జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ విజయంతో గుజరాత్ 10 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకగా, ఓడినప్పటికీ ఆర్సీబీ 12 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది.

Virat Kohli
Rajat Patidar
Umpire
RCB
GT
IPL 2026

More Telugu News