బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar on Phone and CC Camara hacking
  • కేటీఆర్, హరీశ్ తదితర నాయకుల ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపణ
  • ప్రైవేటు హ్యాకర్లను బెంగళూరు నుంచి తీసుకువచ్చారన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సహా నాయకులను ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావులతో పాటు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు హ్యాకర్లను బెంగళూరు నుంచి తీసుకువచ్చి హ్యాక్ చేస్తున్నారని తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా కేటీఆర్, హరీశ్ రావులు ప్రజల ముందు పెట్టారని అన్నారు.

తమ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం సిట్ వేయాలని అన్నారు. ఈ హ్యాకింగ్ వాస్తవమా, కాదా చెప్పాలని అన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు చేయని నేరాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వేస్తోందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్ రావులను ఇరికించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

2024 మార్చిలో ఒక పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు ఇప్పటి వరకు ఒక ధారావాహిక వలె కొనసాగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 350 మంది సాక్షులను విచారించినా ఛార్జ్‌షీట్ మాత్రం ఫైల్ చేయలేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండుసార్లు సిట్ ఏర్పాటు చేశారని అన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సాంకేతిక ఆధారాలతో సరైన సాక్ష్యాలతో విచారణ జరపాల్సిన కేసులో కావాలని కొంతమంది పాత నేరస్థులతో రాజకీయ నాయకుల పేర్లను చెప్పాలని ఒత్తిడి చేసి తప్పుడు ఆధారాలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా ఫోన్ ట్యాపింగ్ సాధారణమే అని, ఏ ప్రభుత్వమైనా ట్యాపింగ్ చేస్తుందని చెప్పారని గుర్తు చేశారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే, చట్టబద్ధంగా విచారణ జరపాలి తప్ప లేని ఆధారాలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలు చూపి రాజకీయ నాయకులను ఇరికించాలని చూడటం సరైంది కాదని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరిగే ప్రక్రియ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొన్న టి.ప్రభాకర్ రావు అనే పోలీసు అధికారిని 19 రోజుల పాటు విచారణ పేరుతో మానసికంగా హింసించారని అన్నారు. కానీ సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల పేర్లు చెప్పాలని బలవంతం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
Go Back to Shorts
RS Praveen Kumar on Phone and CC Camara hacking
BRS leader RS Praveen Kumar

More Telugu News