రేపటి నుంచి అమల్లోకి కీలక మార్పులు.. గ్యాస్ సిలిండర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వరకు కొత్త రూల్స్!

New Rules From May 1 LPG Prices Credit Card Charges Gaming Regulations Among Key Changes
  • మే 1 నుంచి అమల్లోకి రానున్న పలు ఆర్థిక, నియంత్రణ పరమైన మార్పులు
  • ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కీలక మార్పులు
  • ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై పెరగనున్న లేట్ పేమెంట్ ఫీజులు.. మారనున్న ఫీజు మినహాయింపు రూల్స్
  • ఆన్‌లైన్ గేమింగ్ కోసం కఠినమైన కొత్త చట్టం, ప్రత్యేక అథారిటీ ఏర్పాటు
  • సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల సవరణకు అవకాశం
రేప‌టి (మే 1, శుక్రవారం) నుంచి కొత్త నెల ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యుడి దైనందిన జీవితం, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల నుంచి క్రెడిట్ కార్డు చార్జీల వరకు, ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణల వరకు అనేక రంగాల్లో కొత్త నిబంధనలు అమ‌లు కానున్నాయి. ఈ మార్పుల గురించి ముందుగా తెలుసుకోవడం బెట‌ర్‌.

ఎల్‌పీజీ సిలిండర్: ధర, బుకింగ్, డెలివరీలో మార్పులు
ప్రతి నెలా మొదటి తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఈ క్రమంలో మే 1న గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం సాధారణ కుటుంబాల నుంచి హోటళ్లు, రెస్టారెంట్ల వరకు అందరిపైనా పడుతుంది.

గ్యాస్ బుకింగ్ లో కూడా కొత్త నిబంధనలు
ఇకపై గ్యాస్ బుకింగ్ విషయంలో కూడా కొత్త నిబంధనలు రానున్నాయి. ఒకసారి సిలిండర్ బుక్ చేశాక, మళ్లీ బుక్ చేయడానికి పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల నిరీక్షణ కాలాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది. దీంతోపాటు డెలివరీ ప్రక్రియలో భద్రతను పెంచేందుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) విధానాన్ని తప్పనిసరి చేస్తున్నారు. ఇకపై సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడు తమ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని డెలివరీ ఏజెంట్‌కు చెప్పాల్సి ఉంటుంది. అలాగే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులు సబ్సిడీ ప్రయోజనాలు కొనసాగాలంటే, ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. లేనిపక్షంలో సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు చార్జీలలో మార్పులు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ రేప‌టి నుంచి తమ క్రెడిట్ కార్డు నిబంధనలను సవరిస్తోంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం లేట్ పేమెంట్ ఫీజులు, వార్షిక ఫీజు మినహాయింపు షరతుల్లో మార్పులు చేసింది. రూ. 100 నుంచి రూ. 500 మధ్య బకాయిలపై లేట్ పేమెంట్ చార్జి రూ. 100, రూ. 500 నుంచి రూ. 1,000 మధ్య బకాయిలపై రూ. 500 వరకు వసూలు చేయనున్నారు. కొన్ని కార్డులపై గతంలో ఏడాదికి రూ. 50,000 ఖర్చు చేస్తే లభించే వార్షిక ఫీజు మినహాయింపు పొందాలంటే, ఇకపై రూ. 1 లక్ష వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు.

సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల సవరణ
ఎల్‌పీజీ మాదిరిగానే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలను కూడా నెల మొదటి రోజున సవరిస్తారు. ఈ ధరల పెంపు రవాణా ఖర్చులతో పాటు గృహ బడ్జెట్‌లపై కూడా ప్రభావం చూపుతుంది.

ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠిన నిబంధనలు
'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్-2025' కింద రూపొందించిన 'ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ 2026' మే 1 నుంచి అమల్లోకి రావచ్చు. ఈ నిబంధనలను పర్యవేక్షించేందుకు 'ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఓజీఏఐ)' అనే కొత్త నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ చట్టం ప్రకారం గేములను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. అవి: ఆన్‌లైన్ మనీ గేమ్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్. వయోపరిమితులు, తల్లిదండ్రుల నియంత్రణ (పేరెంటల్ కంట్రోల్స్), ఆర్థిక లావాదేవీలపై నిఘా వంటి కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయనున్నారు. ఈ నిబంధనలు దేశీయ, విదేశీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు వర్తిస్తాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మార్పులు పారదర్శకతను పెంచి, వినియోగదారులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినవి. కొన్ని నిబంధనలు మొదట్లో కొంత అసౌకర్యంగా అనిపించినా, దీర్ఘకాలంలో వ్యవస్థలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారుస్తాయని భావిస్తున్నారు.
Go Back to Shorts
New Rules
May 1st
LPG Prices
Credit Card Charges
Gaming Regulations

More Telugu News