పుచ్చకాయ తింటే చచ్చిపోతారా?.. ముంబై కుటుంబం మృతిపై వైద్యులు ఏమంటున్నారంటే..!

  • ముంబైలో ఫుడ్ పాయిజనింగ్‌తో ఒకే కుటుంబంలో నలుగురి మృతి
  • బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత
  • పుచ్చకాయ వల్లే విషాదం జరిగిందా? అనే కోణంలో విచారణ
  • పుచ్చకాయ కూడా ప్రాణాంతకం కావొచ్చన్న నిపుణులు
  • రాత్రిపూట పండ్లు తినడంపై ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
ముంబైలో జరిగిన ఒక విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత వారు అస్వస్థతకు గురై మరణించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనతో వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ తినడం సురక్షితమేనా అనే చర్చ మొదలైంది.

ముంబైలోని జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కుటుంబం తమ బంధువులతో కలిసి రాత్రి ఇంట్లో బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు నలుగురు ఇంట్లో ఉన్న పుచ్చకాయను తిన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అందరికీ వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరి తర్వాత ఒకరు మొత్తం నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు ఈ ఘటనపై ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా వండిన ఆహారం త్వరగా పాడవుతుంది కాబట్టి, బిర్యానీ వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చని భావించినా, పుచ్చకాయ తినడం వల్లే ఇలా జరిగిందా? అనే కోణం ఆందోళన కలిగిస్తోంది.

నిపుణులు ఏమంటున్నారు?
పుచ్చకాయ వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణురాలు రూపాలీ దత్తా తెలిపారు. పుచ్చకాయలో నీటి శాతం, సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుందని ఆమె వివరించారు. కొన్నిసార్లు పండు తియ్యగా కనిపించడానికి గ్లూకోజ్ లేదా చక్కెర నీటిని ఇంజెక్ట్ చేస్తుంటారని, ఆ సమయంలో కలుషితమైన సూదులు వాడితే ప్రమాదకర బ్యాక్టీరియా పండులోకి ప్రవేశించి ప్రాణాంతకంగా మారుతుందని ఆమె హెచ్చరించారు.

డైటీషియన్ డాక్టర్ అర్చనా బాత్రా ప్రకారం సాల్మోనెల్లా, ఈ-కోలై వంటి హానికర బ్యాక్టీరియాలు పండుపై చేరినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. దీనివల్ల తీవ్రమైన డీహైడ్రేషన్, సెప్సిస్ జరిగి కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోవచ్చని ఆమె పేర్కొన్నారు.

అయితే, వైద్య పరీక్షల నివేదికలు రాకుండా ఏ ఒక్క ఆహారం వల్లో ఇలా జరిగిందని చెప్పడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాత్రి 8 గంటల తర్వాత పుచ్చకాయ వంటి పండ్లు తినడం జీర్ణవ్యవస్థపై భారం మోపుతుందని, ఒకవేళ పండు కలుషితమై ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం మృతుల మెడికల్, ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆహార పరిశుభ్రత, నిల్వ విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Go Back to Shorts

More Telugu News