విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన

CM Chandrababu Lay Foundation Stone for Google Data Center
  • విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన
  • 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు
  • అదానీ, ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్
  • పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు
  • ప్రాజెక్ట్ కోసం 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
ఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతోంది.

విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గూగుల్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సందర్శించి అక్కడి టెక్నాలజీలను పరిశీలించారు.

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ పాల్గొన్నారు. గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ప్రతినిధి జీత్ అదానీ, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా తదితరులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ నగరం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో కీలక స్థానం సంపాదించనుంది.

Advertisement
Chandrababu
Lay Foundation Stone
Google Data Center
Vizag

More Telugu News