హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు

No stock boards at Telangana petrol bunks
  • తెలంగాణలో పెరుగుతున్న ఇంధన కొరత సమస్య
  • ప్రస్తుతం పెట్రోల్ కన్నా ఎక్కువగా ఉన్న డీజిల్ కొరత
  • ఇంధన కొరత వార్తలను నమ్మొద్దన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్

ఇంధన కొరత సమస్య ఇప్పుడు తెలంగాణ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సంక్షోభం, తాజాగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలకు పాకింది. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


ప్రస్తుతం పెట్రోల్ కంటే డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. వ్యవసాయ పనులకు, భారీ వాహనాలకు డీజిల్ అత్యవసరమైన తరుణంలో స్టాక్ లేదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఇంధనం దొరకదనే వదంతులు సోషల్ మీడియాలో షికారు చేయడంతో, ప్రజలు డబ్బాలు, డ్రమ్ములతో బంకుల వద్దకు క్యూ కడుతున్నారు.


పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి ఈ సమస్య వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా, దేశీయంగా ధరలు పెరగకపోవడంతో ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకునే క్రమంలో కంపెనీలు తమ రిటైల్ అవుట్‌లెట్లకు చేసే సరఫరాలో భారీగా కోత విధించాయి. అడ్వాన్స్ పేమెంట్ చేసినా ట్యాంకర్లు రావడం లేదని, క్రెడిట్ ఫెసిలిటీని కూడా కంపెనీలు రద్దు చేశాయని ఆయన పేర్కొన్నారు.


మరోవైపు, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. వినియోగదారులు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని, ఇంధనాన్ని నిల్వ చేసే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు.

Go Back to Shorts
Petrol
Diesel
No Stock

More Telugu News