కేవలం 22 నిమిషాల్లోనే కమాండ్ ఖతం.. 'ఆపరేషన్ సిందూర్‌'పై ఆర్మీ కీలక పోస్ట్

  • కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేశామన్న ఆర్మీ
  • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’
  • తొలి వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో వివరాల వెల్లడి 
  • పాక్, పీఓకేలో 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటన
  • దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ‘ఆపరేషన్ మహాదేవ్’తో ఏరివేసిన సైన్యం
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తొలి వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆ ఆపరేషన్‌కు సంబంధించిన కీలక వివరాలను సైన్యం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కేవలం 22 నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను ఎలా కుప్పకూల్చిందీ వివరిస్తూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. "నిర్ణయం, స్పష్టత, లక్ష్యంపై దృష్టి.. న్యాయం జరిగింది, వేగంగా, కచ్చితంగా" అంటూ సైన్యం తన పోస్టులో పేర్కొంది.

ఆదివారం కూడా ఆర్మీ మరో పోస్ట్ చేస్తూ.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీఓకే) లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు చెందిన 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. "భారత్ మర్చిపోదు" అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వివరాలను పంచుకుంది. ఈ ఆపరేషన్ల తర్వాత భారత సైన్యం తన సన్నద్ధతను మరింత పటిష్ఠం చేసుకుందని, "కొత్త సర్దుబాటు, పటిష్ఠం, సన్నద్ధం.. ఆత్మనిర్భర్ భారత్ సిద్ధంగా ఉంది" అని గత వారం మరో పోస్టులో స్పష్టం చేసింది.

గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం అడిగి తెలుసుకుని 26 మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన ఘటనకు ప్రతిస్పందనగానే భారత సైన్యం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ దాడి జరిగిన వెంటనే భారత సైన్యం ‘ఆపరేషన్ మహాదేవ్’ను ప్రారంభించింది. దాదాపు 93 రోజుల పాటు 300 చదరపు కిలోమీటర్ల కఠినమైన హిమాలయ ప్రాంతంలో గాలించి, దాడికి పాల్పడిన ముగ్గురు ప్రధాన ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

ఆ తర్వాత వ్యూహాత్మక ప్రతీకార చర్యగా మే 6, 7 తేదీల్లో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాక్, పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడిని నిర్వహించింది. ఉగ్రవాదాన్ని భారత్ ఎంతమాత్రం సహించబోదని, దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ప్రతిస్పందన కచ్చితంగా ఇలాగే ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆపరేషన్ అనంతరం 50 కొత్త మిషన్-రెడీ యూనిట్లు, 4 అదనపు ఫార్మేషన్లు, 5 లక్షలకు పైగా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నట్లు సైన్యం వెల్లడించింది.

Operation Sindoor
Indian Army
Jammu and Kashmir
Lashkar-e-Taiba
Jaish-e-Mohammed
POK
Terrorist Camps
Counter Terrorism
Pahalgam Attack
Operation Mahadev

More Telugu News