'యూజ్ అండ్ కిల్'.. ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్: మంత్రి మండిపల్లి ఫైర్

Mandi Palli Ramprasad Reddy Slams Jagans Politics
  • 'యూజ్ అండ్ కిల్' విధానమే జగన్ రాజకీయమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • పెద్ద దస్తగిరి హత్య జగన్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణ
  • అధికారం కోల్పోయినా వైసీపీ నేతల ఆగడాలు తగ్గలేదని విమర్శ
  • వివేకా హత్య తరహాలోనే దస్తగిరి కేసులోనూ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్య
  • వైసీపీ నేతల భూకబ్జాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
'యూజ్ అండ్ కిల్'... ఇదే వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ ముఖచిత్రం అని, అధికారం కోల్పోయి రెండేళ్లు గడుస్తున్నా ఆ పార్టీ పద్ధతి మార్చుకోలేదని రాష్ట్ర రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ నేతలు ఇప్పటికీ కమాండ్ కంట్రోల్ నడుపుతూ రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

కడపలో ఇటీవల జరిగిన పెద్ద దస్తగిరి హత్య వెనుక జగన్ ఉన్నారని, ఆయన కనుసన్నల్లోనే ఈ ఘాతుకం జరిగిందని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడైన దస్తగిరిని, భూ లావాదేవీల గొడవల్లో భాగంగా వైసీపీ ముఠాలే హతమార్చాయని పేర్కొన్నారు. హత్య తర్వాత దస్తగిరి ఇంట్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో వందల కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభించాయని, వాటిలో రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన భార్య, కుమారుడి పేర్లు ఉండటమే వైసీపీ ముఠాల భూదాహానికి నిదర్శనమని వివరించారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా 'దండయాత్ర' చేసే జగన్, తన సొంత జిల్లాలో, తన ముఖ్య అనుచరుడు హత్యకు గురైతే కనీసం పరామర్శించేందుకు ఎందుకు వెళ్లలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిలదీశారు. ఇది ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. గతంలో బాబాయి వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసి, ఆ నిందను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెట్టి 'నారాసుర రక్త చరిత్ర' అంటూ విష ప్రచారం చేసినట్టే.. ఇప్పుడు దస్తగిరి హత్యను కూడా కూటమి ప్రభుత్వంపైకి నెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.

డ్రైవర్‌ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వంటి నేరస్థులను ప్రోత్సహించడం జగన్ నైజమని మంత్రి విమర్శించారు. వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి, నైతికత ఉంటే తక్షణమే అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించి, భూకబ్జాలు చేసి కట్టుకున్న ప్యాలెస్‌లు, వారి దౌర్జన్యాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. భూములు, ఆస్తులు కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేసి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాయలసీమలో నేర సామ్రాజ్యాలు స్థాపించడం జగన్‌కే చెల్లిందని, అందుకే అక్కడి ప్రజలు వైసీపీని భూస్థాపితం చేశారని అన్నారు. వైసీపీ అరాచక రాజకీయాలను, కుట్రలను రాష్ట్ర ప్రజలు ఇకపై నమ్మే పరిస్థితి లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 

Go Back to Shorts
Mandi Palli Ramprasad Reddy
YS Jagan
YSRCP
Andhra Pradesh Politics
Dastagiri Murder
Ravindranath Reddy
TDP
Anantha Babu MLC
Kadapa
Tadepalli Palace

More Telugu News