హ‌ర్మూజ్ జలసంధిలో మరో ఉద్రిక్తత.. భారత అధికారి ఉన్న నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

Sanjay Mahar Indian Officer on Ship Seized by Iran in Hormuz Strait
  • హ‌ర్మూజ్ జలసంధిలో భారత్‌కు వస్తున్న నౌక ఇరాన్ స్వాధీనం
  • నౌకలో రాజస్థాన్‌కు చెందిన వైస్ కెప్టెన్ సహా 21 మంది సిబ్బంది
  • కాల్పులు జరిగాయని, తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపిన భారత అధికారి
  • తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ మరో అంతర్జాతీయ నౌకను తన అదుపులోకి తీసుకుంది. భారత్‌కు వస్తున్న 'ఎపామినోండెస్' అనే కంటైనర్ నౌకను హ‌ర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో వైస్ కెప్టెన్‌గా పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన సంజయ్ మహర్ (38) సహా మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో సంజయ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే... సౌదీ అరేబియా నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ఈ నౌక బయలుదేరింది. గత మూడు, నాలుగు రోజులుగా హ‌ర్మూజ్ జలసంధి దాటేందుకు క్లియరెన్స్ కోసం వేచి చూస్తోంది. శుక్రవారం జలసంధిలోకి ప్రవేశించగానే ఇరాన్ గార్డ్స్ నౌకను చుట్టుముట్టి కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత సంజయ్ మహర్ తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దళాలు నౌకను స్వాధీనం చేసుకున్నాయని, కాల్పుల సమయంలో తామంతా నౌకలోని సురక్షిత ప్రదేశంలోకి వెళ్లామని, ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నామని ఆయన తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

"మొదట మీడియా ద్వారా ఈ విషయం తెలిసి మేం చాలా కంగారుపడ్డాం. తర్వాత మా అబ్బాయి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అయినప్పటికీ మాకు చాలా ఆందోళనగా ఉంది. నౌకలోని భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం" అని సంజయ్ తండ్రి ఓం ప్రకాశ్ మహర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంజయ్ కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే జైదీప్ బిహానీని కలిసి విషయాన్ని వివరించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి, తమ వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్, శ్రీలంక దేశాలకు చెందిన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సుమారు 15 ఏళ్లుగా మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సంజయ్, 20 రోజుల క్రితమే డ్యూటీ కోసం ఇంటి నుంచి వెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Go Back to Shorts
Sanjay Mahar
Iran
Hormuz Strait
Epaminondes
Container Ship
Indian Officer
IRGC
Saudi Arabia
Mundra Port
Ship Seizure

More Telugu News