తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హోం శాఖ కార్యదర్శిగా శిఖా గోయల్

  • తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియామకం
  • తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ వస్తారన్న ఊహాగానాలు
  • ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ
  • మరో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
  • మల్కాజ్‌గిరి కొత్త పోలీస్ కమిషనర్‌గా బి. సుమతికి బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, రాష్ట్ర తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ రానున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌కు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా ఆమె కొనసాగిస్తారు.

శిఖా గోయల్ బదిలీతో, ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్‌కు డీజీపీగా పదోన్నతి లభించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1996 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ను నియమిస్తారని భావిస్తున్నారు. ఆనంద్ గతంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌గా, ఏసీబీ డీజీగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రభుత్వం మరో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది. దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమించారు. షానవాజ్ ఖాసింను మల్టీ-జోన్-II ఐజీగా బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషి బాధ్యతలు చేపట్టనున్నారు. అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ డీజీగా, ఎక్సైజ్ డైరెక్టర్‌గా నియమించారు. మల్కాజ్‌గిరి కొత్త పోలీస్ కమిషనర్‌గా బి. సుమతిని నియమించారు. ఐజీపీ, ఎస్‌ఐబీగా కార్తికేయకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.



Shikha Goel
Home Secretary
Telangana
IPS
Transfers
Promotions

More Telugu News