జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ... మండలి చైర్మన్ పై వేపాడ చిరంజీవి ఫైర్

  • జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించడం అప్రజాస్వామికమన్న వేపాడ
  • ఎవరి ప్రయోజనాల కోసం రాజీనామాలు ఆమోదించడం లేదో చైర్మన్ చెప్పాలని నిలదీత
  • కోర్టు జరిమానా విధించినా చైర్మన్ తీరులో మార్పు లేదని విమర్శలు
  • చైర్మన్ పార్టీకి విధేయుడిగా కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలని సూచన
  • రాజకీయాలు చేయాలంటే పదవి వదిలి రావాలని చైర్మన్‌కు హితవు
ఎమ్మెల్సీ పదవికి సభ్యులు చేసిన రాజీనామాలను శాసనమండలి చైర్మన్ (కె.మోషేను రాజు) తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికమని, ఆయన తీరులోనే సహేతుకత లేదని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చైర్మన్ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో పాటు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ సహా ఆరుగురు సభ్యులు వైసీపీకి, తమ ఎమ్మెల్సీ పదవులకు 2024 నవంబర్‌లోనే రాజీనామా చేశారు. దాదాపు ఏడాది గడిచినా, సభలో స్వయంగా లేచి నిలబడి అభ్యర్థించినా చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో జయమంగళ కోర్టును ఆశ్రయించగా, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని చైర్మన్‌కు 2025 సెప్టెంబర్‌లో రూ.10,000 జరిమానా విధిస్తూ 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రాజీనామాను తిరస్కరించడం దారుణం” అని అన్నారు.

శాసనమండలి రూల్ నెం.190 ప్రకారం, సభ్యులను వ్యక్తిగతంగా పిలిచి విచారించిన తర్వాత కూడా, వారు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పినా ఎందుకు ఆమోదించలేదని చిరంజీవి ప్రశ్నించారు. “ఎవరి ప్రయోజనాలను కాపాడటానికి చైర్మన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలి. 'సహేతుక కారణం లేదు' అని చెబుతూ రాజీనామాను తిరస్కరించిన చైర్మన్ తీరులోనే సహేతుకత కొరవడింది” అని ఆయన దుయ్యబట్టారు.

స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన సోమనాథ్ ఛటర్జీ వంటి నేతల ఆదర్శాలను గుర్తుచేస్తూ, ప్రస్తుత చైర్మన్ మాత్రం ఒక పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మహాభారతంలో కర్ణుడు ఎంత గొప్పవాడైనా అధర్మం వైపు నిలబడటంతో కీర్తిని కోల్పోయాడు. పార్టీ కోసం పనిచేయాలనుకుంటే పదవికి రాజీనామా చేసి బయటకు రావాలి. అంతేకానీ చైర్మన్ స్థానం గౌరవాన్ని మంటగలపవద్దు. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి శాసనమండలి గౌరవాన్ని, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలి” అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

Vepada Chiranjeevi
MLC
Chairman
Jayamangala Venkataramana TDP
YSRCP

More Telugu News