"దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా" అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం

Didi I miss you says emotional rebel MP Satabdi Roy
  • టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం
  • 'దీదీ, మిస్ యూ' అంటూ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఆవేదన
  • ఎన్డీయేకు మద్దతివ్వడం సరైన నిర్ణయమేనని వ్యాఖ్య
  • కానీ నైతికంగా తప్పు చేస్తున్నాననే భావన కలుగుతోందన్న నటి
  • లోక్‌సభలో పార్టీ చీలిక.. ఎన్డీఏకు మద్దతిస్తామన్న 20 మంది ఎంపీలు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై అసమ్మతి గళం వినిపిస్తున్న రెబల్ ఎంపీ, ప్రముఖ నటి శతాబ్ది రాయ్ తాజాగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరంగా ఎన్డీఏకు మద్దతు తెలపడం సరైన నిర్ణయమే అయినప్పటికీ, నైతికంగా మాత్రం తాను తప్పు చేస్తున్నానన్న భావన కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మమతా బెనర్జీకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు, "దీదీ, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను" అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర అసెంబ్లీలో సుమారు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేయగా, ఇప్పుడు లోక్‌సభలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, తాము ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని పేర్కొంటూ జూన్ 9న లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేందుకే వారు ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి చేతిలో టీఎంసీ ఓటమి పాలైన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మమతా బెనర్జీ కుటుంబ సభ్యులు పార్టీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, పార్టీ పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారని రెబల్స్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు మమత బెనర్జీ నివాసం సమీపంలోని టీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు, అభిషేక్ బెనర్జీ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది.

కాగా, ఈ తిరుగుబాటును మమత బెనర్జీ వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. రెబల్స్ నాయకులంతా అవకాశవాదులని, వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని విమర్శిస్తోంది. పార్టీ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సవాలును ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ, ఈ సంక్షోభం నుంచి పార్టీని ఎలా గట్టెక్కిస్తారోనన్న అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
Satabdi Roy
Mamata Banerjee
Trinamool Congress
West Bengal Politics
TMC Rebel MPs
NDA Support

More Telugu News