దేవదాయ శాఖ ఏసీ శాంతి మళ్లీ ఏసీబీ కస్టడీకి

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీ శాంతి రెండోసారి ఏసీబీ కస్టడీకి
  • విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపిన ఏసీబీ అధికారులు
  • రూ.1.37 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు వెల్లడించిన ఏసీబీ
  • రెండేళ్లలో రెండుసార్లు సస్పెన్షన్‌కు గురైన అధికారిణి శాంతి
  • విజయవాడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె విచారణకు సహకరించడం లేదని ఏసీబీ చేసిన విజ్ఞప్తి మేరకు, విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ‌ ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న శాంతిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఆమెను విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి తరలించారు.

ఈ కేసులో శాంతిని ఏసీబీ కస్టడీకి తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఈ నెల‌ 15, 16 తేదీల్లో ఆమెను విచారించేందుకు కోర్టు అనుమతించింది. అయితే, ఆ సమయంలో ఆమె విచారణకు ఏమాత్రం సహకరించలేదని, కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదించారు. దీంతో మరోసారి కస్టడీకి అనుమతించాలని కోరగా, న్యాయస్థానం అంగీకరించింది. 

ఈ నెల‌ 7న తాడేపల్లి, ఉండవల్లి, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో శాంతికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో ఆమె ఆదాయానికి మించి రూ.1.37 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. విశాఖపట్నంలో ఒక ఫ్లాట్, కుంచనపల్లిలో జీ+2 భవనం, 776 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక మోటార్‌సైకిల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సోదాల అనంతరం అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రెండేళ్ల వ్యవధిలో శాంతి సస్పెన్షన్‌కు గురవడం ఇది రెండోసారి. 2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవదాయ శాఖలో ఏసీగా నియమితులైన ఆమె, 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవకతవకల ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. 2024 జులై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్‌లో ఉండి, గతనెలలోనే తిరిగి విధుల్లో చేరారు. ఆమెకు ఇంకా పోస్టింగ్ ఇవ్వకముందే ఈ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కావడం గమనార్హం.

More Telugu News