యోగి నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ
- వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు
- యోగి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామన్న నితిన్ నబీన్
- ఇప్పటికే మిషన్ 2027 పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమాజ్‌వాదీ పార్టీ
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్నకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. యోగి నాయకత్వంలోనే ఎన్నికల రణక్షేత్రంలోకి వెళతామని ఆయన స్పష్టం చేశారు. "యూపీలో యోగి ఆదిత్యనాథే మా ముఖచిత్రం. ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే ప్రభుత్వం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే మా సారథి" అని అన్నారు.
2017, 2022 విజయాల తర్వాత 2027లో కూడా ఘనవిజయం సాధించి యూపీలో బీజేపీ హ్యాట్రిక్ సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు నేరాలకు నిలయంగా ఉన్న యూపీ, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ వేలు, శాంతిభద్రతలు, పారిశ్రామికాభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని పేర్కొన్నారు. మోదీ-యోగి 'డబుల్ ఇంజిన్' సర్కార్ చేసిన పనులే తమకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు తెస్తాయని చెప్పారు.
మరోవైపు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే 'మిషన్ 2027' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ముందస్తుగానే తన సేనానిని ప్రకటించి వ్యూహాత్మకంగా అడుగు వేసింది.