హర్మూజ్ జలసంధి దాటిస్తామంటూ అధికారుల రూపంలో ఘరానా మోసం

  • హర్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన ఇంధన నౌకలు
  • క్రిప్టోకరెన్సీ చెల్లిస్తే బదులుగా నౌకలను హర్మూజ్ దాటిస్తామంటున్న దోపిడీదారులు
  • ఇరాన్ అధికారులమంటూ నమ్మబలుకుతున్న దోపిడీదారులు
నేటి కాలంలో మనం ఎన్నో రకాల మోసాలను చూస్తున్నాం. ఆర్థిక మోసాలు మొదలు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల వరకు చిత్రవిచిత్రమైన మోసాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, వినడానికి విచిత్రంగా ఉన్న మరో మోసం వెలుగు చూసింది. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో నౌకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఒకవైపు ఇరాన్ హర్మూజ్‌ను మూసివేయగా, మరోవైపు అమెరికా దిగ్బంధిస్తోంది.

ఈ క్రమంలో కొందరు దోపిడీదారులు అధికారుల వేషంలో అక్కడ నిలిచిపోయిన నౌకల వద్ద డబ్బు వసూలు చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ చెల్లిస్తే దానికి బదులుగా నౌకలను హర్మూజ్ జలసంది దాటిస్తామని నమ్మబలుకుతున్నారు. దోపిడీదారుల తీరును గుర్తించిన గ్రీక్ మ్యారిటైమ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సంస్థ 'మారిస్క్స్' నౌకల యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది.

తాము ఇరాన్ అధికారులమని, ఓడను హర్మూజ్ దాటిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని సూచించింది. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, టెథర్ రూపంలో చెల్లింపులు జరిపితే మీ నౌకలను హర్మూజ్ జలసంధి దాటిస్తామని ఈ దోపిడీదారులు నమ్మిస్తున్నారని, అలా అధికారుల వేషంలో వస్తే నమ్మవద్దని సూచించింది. ఇరాన్ అధికారులు ఇలాంటి అవకాశాలు కల్పించలేదని స్పష్టం చేసింది. ఇది కచ్చితంగా మోసగాళ్ళ పనే అని పేర్కొంది.

crypto for ships safe passage through Hormuz
Strait of Hormuz

More Telugu News