ఇక ఆరు రోజులే... చివరి దశకు రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్

  • అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా
  • తనకు స్ఫూర్తినిచ్చిన పాత్ర పెద్ది అని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడి
  • రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న చిత్రం
  • పహిల్వాన్‌గా రామ్ చరణ్
  • హీరోయిన్ గా జాన్వీ కపూర్... ఏఆర్ రెహమాన్ సంగీతం
  • జూన్‌లో సినిమాను విడుదల 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సినిమా చిత్రీకరణ మరో 6 రోజుల్లో పూర్తవుతుందని దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా వెల్లడించారు. రామ్ చరణ్‌తో సెట్స్‌లో దిగిన సెల్ఫీని పంచుకుంటూ, "నాకు అత్యంత స్ఫూర్తినిచ్చిన పాత్ర.. నేను ప్రేమించే పెద్ది" అంటూ ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు.

పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ 'పెద్ది' అనే టైటిల్ రోల్‌లో, మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ రస్టిక్ అవతార్‌లో పహిల్వాన్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ఆయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు ఆ చివరి పాట చిత్రీకరణ కూడా ముగింపు దశకు రావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, సినిమాను 2026 జూన్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Peddi
Ram Charan
Buchibabu Sana
Global Star
Tollywood

More Telugu News