దక్షిణాదిపై జనసేన ఫోకస్.. కేరళలో పార్టీ విస్తరణకు తొలి అడుగు

  • కేరళలో పార్టీ బలోపేతంపై ఎమ్మెల్సీ నాగబాబు కీలక సమావేశం
  • వివిధ పార్టీల నుంచి 200 మందికి పైగా నేతలు జనసేనలో చేరిక
  • పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇతర రాష్ట్రాల్లో విస్తరణ అని ప్రకటన
  • దక్షిణాది అంతటా పర్యటించి పార్టీని విస్తరిస్తామన్న నేతలు
ఏపీలో అధికారంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ, ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. తొలి అడుగుగా కేరళలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన నాయకత్వం నడుం బిగించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కేరళ రాజధాని తిరువనంతపురంలో పర్యటించారు.

స్థానిక నేతల అభ్యర్థన మేరకు తిరువనంతపురంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం నాగబాబు, తాళ్లూరి రామ్ సమక్షంలో కేరళకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నుంచి సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, నేషనల్ లేబర్ పార్టీ, హిందుస్థాన్ అవామీ మోర్చా వంటి పార్టీల నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పి నాగబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ.. దశాబ్దకాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాడి ఏపీలో అధికారంలోకి వచ్చామని, ఇక్కడి అభివృద్ధి, పాలన చూసి ఇతర రాష్ట్రాల వారు తమ ప్రాంతాల్లో జనసేనను విస్తరించాలనుకోవడం శుభపరిణామమని అన్నారు. ప్రాంతం, భాష వేరైనా జనసేన సిద్ధాంతాలు ఒక్కటేనని, అయితే స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.

జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలను ఆకట్టుకుంటోందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ విస్తరణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయని, పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి జనసేనను విస్తరించే ప్రయత్నాలు చేస్తామని వివరించారు.

Janasena Party
Konidela Nagababu
Kerala
Pawan Kalyan
Andhra Pradesh Politics
South India Politics
Party Expansion
Talluri Ram
Political Strategy
Kerala Politics

More Telugu News