దొరికినట్టే దొరికి తప్పించుకున్న నిదా ఖాన్.. టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం

  • నిదా ఖాన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
  • ఆమె లొకేషన్ వివరాలు వెల్లడించిన భర్త
  • పోలీసులు వెళ్లేసరికే ఇంటికి తాళం వేసి పరారీ
టీసీఎస్ నాసిక్ వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్ ఆచూకీ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఆమె భర్త స్వయంగా ఆచూకీ చెప్పినప్పటికీ, పోలీసుల రాకను పసిగట్టిన నిదా ఖాన్ అక్కడి నుంచి పరారైంది. దీంతో ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. విచారణలో భాగంగా పోలీసులు నిదా ఖాన్ భర్తను ప్రశ్నించగా, ఆయన పోలీసులకు సహకరించాడు. తన భార్య ప్రస్తుతం ఎక్కడ ఉంటోందో స్పష్టమైన సమాచారం అందించాడు. ఆ లొకేషన్ ఆధారంగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే, వారు వెళ్లేసరికే ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు. పోలీసులు వస్తారని ఊహించి నిదా ఖాన్ అక్కడి నుంచి తప్పించుకుంది.

టీసీఎస్‌లో హెచ్ ఆర్ విభాగంలో పనిచేసిన నిదా ఖాన్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. టీమ్ లీడర్లు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పైపెచ్చు నిందితులకు మద్దతుగా నిలిచిందని, మతం మారాలంటూ బాధితులపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులను టార్గెట్ చేసి బలవంతంగా మతమార్పిడులకు పాల్పడేందుకు పథకం ప్రకారమే నిదా ఖాన్ వ్యవహరించిందని అనుమానిస్తున్నారు.

బాధితుల ఫిర్యాదుతో పోలీసులు మొత్తం 9 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. లైంగిక వేధింపులకు పాల్పడిన టీమ్ లీడర్లను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్ మాత్రం పరారీలో ఉంది. దీంతో ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నిదా ఖాన్ తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడంతో ఆమెను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఆమెకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు.

Nida Khan
TCS Nashik case
sexual harassment case
HR manager
religious conversion
police investigation
absconding
team leaders
Maharashtra police
crime news

More Telugu News