ఒక్కరి ఓటు కోసం.. గుజరాత్ అడవిలో ఈసీ ప్రత్యేక పోలింగ్ బూత్
- దట్టమైన గిర్ అడవుల్లోని మహదేవ్ ఆలయంలో నివసిస్తున్న మహంత్ హరిదాస్ బాపు
- ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఒకే ఒక వ్యక్తి హరిదాస్ బాపు
- ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్ బూత్.. సిబ్బందిని పంపుతున్న ఈసీ
గిర్‌గఢ్‌డా తాలూకాలోని జమ్వాలా గ్రామానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, ఎటువంటి జనావాసం లేని ఏకాంత ప్రదేశంలో చారిత్రాత్మక బనేజ్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ నివసించేది మహంత్ హరిదాస్ బాపు ఒక్కరే కావడంతో ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఓటరు కోసం అధికారులు, సిబ్బందిని 20 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతానికి ఈసీ పంపుతోంది. ఇందులో భాగంగా ప్రిసైడింగ్ అధికారి, సిబ్బంది, పోలీసు సిబ్బంది పోలింగ్‌కు ఒకరోజు ముందుగానే అటవీ ప్రాంతానికి చేరుకుని రాత్రంతా అక్కడే ఉంటారు. మహంత్ హరిదాస్ బాపు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వీరంతా తిరుగు ప్రయాణమవుతారు. కాగా, గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుండగా, ఏప్రిల్ 28న ఓట్లను లెక్కిస్తారు.