మల్కాజ్‌గిరిలో 30 లక్షలమంది ఓటర్లు ఉంటే, మరోచోట తక్కువ ఉన్నారు: లోక్‌సభలో అమిత్ షా

  • నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో సమతౌల్యత లేదన్న అమిత్ షా
  • ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు అని ముక్కలు చేసి మాట్లాడవద్దని హితవు
  • వచ్చే ఎన్నికల్లో అమలు చేయడానికి బిల్లులు తెచ్చామన్న అమిత్ షా
ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో సమతౌల్యత లేదని, మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో 30 లక్షలమంది ఉంటే, మరోచోట ఓటర్లు చాలా తక్కువగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తర, దక్షిణ భారతాలు అంటూ ముక్కలు చేసి మాట్లాడకూడదని హితవు పలికారు. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను తీసుకువచ్చామని, వచ్చే ఎన్నికల్లో వీటిని అమలు చేసేలా ముందుకు సాగుతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

మహిళా రిజర్వేషన్ సహా మూడు బిల్లులపై లోక్ సభలో చర్చ ముగియడంతో అమిత్ షా సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో వీటిని అమలు చేసేలా ముందుకు వెళతామని అన్నారు. ఇండియా కూటమి సభ్యులు ఈ బిల్లులను వ్యతిరేకించినట్లు చెప్పారు. మూడు బిల్లులపై సమగ్ర చర్చ జరిగిందని, 130 మంది ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారని అన్నారు. 56 మంది మహిళా ఎంపీలు మాట్లాడారని అన్నారు. మహిళా బిల్లును విపక్షాలు వ్యతిరేకించినట్లు చెప్పారు. ప్రస్తుతం లోక్ సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని అన్నారు.

ఒకచోట 39 లక్షలమంది ఓటర్లు ఉంటే మరోచోట 60 వేలమంది ఓటర్లు ఉన్నారని అమిత్ షా తెలిపారు. ఒక ఎంపీ లక్షలాది మంది సమస్యలను ఎలా వినగలరు, ఎలా పరిష్కరించగలరని పేర్కొన్నారు. నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యలో సమతౌల్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఎంపీ తన నిధులు సమర్థంగా వినియోగించుకునేందుకు ఇది తోడ్పడుతుందని అన్నారు. అందుకే రాజ్యాంగ సవరణకు ముందడుగు వేసినట్లు చెప్పారు.

తెలంగాణలోని మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో 30 లక్షలమంది ఓటర్లు ఉన్నారని, ఢిల్లీ, బెంగళూరులలో కూడా 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు అమిత్ షా తెలిపారు. డీలిమిటేషన్ తర్వాత ఆయా ప్రాంతాల్లో రెండు సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. దీనివల్ల ఎంపీలకు, ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 1972లో ఇందిరా గాంధీ సీట్ల సంఖ్యను 545కు పెంచగా, ఇన్నాళ్లు పెంచకుండా అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు.

ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేయడం సరికాదని అమిత్ షా హితవు పలికారు. దేశమంతా ఒక్కటేనని, ఉత్తర, దక్షిణ బేధాలు చూపిస్తూ ముక్కలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి ప్రాంతానికి దేశంపై సమాన అధికారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతాలకు అతీతంగా సభ్యులందరికీ సమాన అధికారం ఉంటుందని చెప్పారు.

Amit Shah
Malkajgiri
Lok Sabha
Voter Discrepancy
Delimitation
Telangana
Constituency Size

More Telugu News