అపార్ట్‌మెంట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లు తప్పనిసరి... తెలంగాణ సర్కారు కొత్త పాలసీ

EV charging points mandatory in Telangana apartments new policy
  • అపార్ట్‌మెంట్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు తప్పనిసరి చేసేలా కొత్త పాలసీ
  • ఈవీల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలు
  • రాష్ట్రంలో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని సీఎస్ ఆదేశం
  • ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై రాష్ట్రంలోని అపార్ట్‌మెంట్ భవనాల బేస్‌మెంట్‌లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఈ మేరకు ఇంధన శాఖ కసరత్తు చేస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ నిర్ణయంతో నగరవాసులకు ఇళ్లలోనే సులువుగా ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం కలగనుంది.

శుక్రవారం నాడు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నవీన్ మిట్టల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన ఇంధన వినియోగం లక్ష్యంగా ఈవీల వాడకాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సీఎస్ నొక్కిచెప్పారు.

ఈవీ వినియోగదారుల్లో విశ్వాసం పెంచేందుకు బలమైన, విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జింగ్ సౌకర్యాలు సులభంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాలన్నారు. అలాగే, రాష్ట్రంలోని ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను మ్యాప్ చేయడానికి, పర్యవేక్షించడానికి ఒక కేంద్రీకృత, రియల్-టైమ్ డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయాలని కూడా సీఎస్ సూచించారు.

ఈ సమీక్షలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, టీజీఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా కమిషనర్ ఇళంబరితి, టీజీఐఐసీ వీసీ, ఎండీ శశాంక, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, టీజీరెడ్కో ఎండీ అనీల వావిళ్ల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Naveen Mittal
Telangana EV policy
electric vehicles
EV charging stations
apartment charging
K Ramakrishna Rao
Telangana government
EV infrastructure
GHMC
TGREDCO

More Telugu News