అణు నిల్వల అప్పగింతకు ఇరాన్ ఓకే: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump Announces Iran Agrees to Return Nuclear Stockpiles
  • ఇరు దేశాల మధ్య ఒప్పందానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడి
  • మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌కు ప్రశంసలు
  • ఇరాన్ విషయంలో పోప్ లియో వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్
  • ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు తప్పవని హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య గత ఆరు వారాలుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అణు కార్యక్రమానికి కీలకమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ కొనసాగుతున్న చర్చల్లో ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ అభివర్ణించారు. "వారు శుద్ధి చేసిన యురేనియంను మాకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు" అని ఆయన తెలిపారు. ఈ వారాంతంలోనే తదుపరి చర్చలు జరగవచ్చని, ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం కూడా రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. "నాలుగు వారాల బాంబు దాడులు, శక్తిమంతమైన దిగ్బంధనం వల్లే ఇరాన్ ఇప్పుడు మెత్తబడింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

గత చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమాలపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరాన్ తన అణు కార్యకలాపాలను 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించగా, ఇరాన్ మాత్రం 3 నుంచి 5 ఏళ్ల విరామానికి మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే తాజాగా, తమ యురేనియం నిల్వల్లో కొంత భాగాన్ని దేశం వెలుపలకి పంపేందుకు టెహ్రాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌లను ట్రంప్ ప్రశంసించారు. ఒప్పందం ఇస్లామాబాద్‌లో జరిగితే తాను కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్ విషయంలో పోప్ లియో XIV వైఖరిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇరాన్ చేతిలో అణ్వాయుధం ఉండకూడదని పోప్ అర్థం చేసుకోవాలి. ఆయన ఏమైనా చెప్పవచ్చు, కానీ నేను దానితో ఏకీభవించను" అని ట్రంప్ అన్నారు. వచ్చే వారంతో కాల్పుల విరమణ గడువు ముగియనుండగా, ఒకవేళ ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.
Go Back to Shorts
Donald Trump
Iran nuclear deal
US Iran tensions
uranium enrichment
Shahbaz Sharif
Asim Munir
Pakistan mediation
Pope Leo XIV
nuclear weapons
Tehran

More Telugu News