తెలంగాణలో టాప్ 3 కులాలు ఇవే... నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం

  • తెలంగాణ కుల సర్వే అధికారిక గణంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
  • రాష్ట్రంలో 56.36 శాతంతో బీసీలదే అగ్రస్థానం అని వెల్లడి
  • జనాభా పరంగా మాదిగ, షేక్ ముస్లిం, ముదిరాజ్ తొలి మూడు స్థానాల్లో
  • ఓసీల్లో రెడ్డి, ఎస్టీల్లో లంబాడీల జనాభా అత్యధికం
  • దాదాపు 4 శాతం మంది ప్రజలు తమకు కులం లేదని వెల్లడించిన వైనం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వేకు సంబంధించిన అధికారిక గణంకాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (బీసీలు) 56.36 శాతంతో అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచారు. జనాభా పరంగా మాదిగ, షేక్ ముస్లిం, ముదిరాజ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశంలోనే ఆదర్శవంతంగా, అత్యంత పారదర్శకంగా ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ భారీ కసరత్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.03 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేశారు. ప్రజల నుంచి 'సెల్ఫ్ డిక్లరేషన్' పద్ధతిలో వివరాలను సేకరించారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 1,12,36,849 కుటుంబాలను సర్వే బృందాలు సందర్శించి, 3,55,50,759 మంది జనాభా వివరాలను నమోదు చేసినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.

సామాజిక వర్గాల వారీగా జనాభా వాటా
సర్వే ఫలితాల ప్రకారం, రాష్ట్ర జనాభాలో బీసీల తర్వాత షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) 17.42 శాతం, అగ్రవర్ణాలు (ఓసీలు) 15.79 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) 10.43 శాతం చొప్పున ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుమారు 4 శాతం మంది ప్రజలు తమకు ఎలాంటి కులం లేదని (No Caste) తమ డిక్లరేషన్‌లో పేర్కొనడం గమనార్హం.

కులాల వారీగా ప్రధాన వర్గాలు
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులాల జాబితాను పరిశీలిస్తే, 36.58 లక్షల మందితో (10.3 శాతం) మాదిగ సామాజిక వర్గం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 27.96 లక్షల మందితో (7.9 శాతం) షేక్ ముస్లింలు రెండో స్థానంలో, 26.39 లక్షల జనాభాతో (7.4 శాతం) ముదిరాజ్ సామాజిక వర్గం మూడో స్థానంలో ఉన్నాయి.

ఓసీ వర్గాల్లో: రెడ్డి సామాజిక వర్గం 4.8 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కోమటి (1.4 శాతం), కమ్మ (1.0 శాతం), బ్రాహ్మణ (0.9 శాతం), కాపు/నాయుడు (0.7 శాతం), వెలమ (0.4 శాతం) ఉన్నారు.

బీసీ వర్గాల్లో: షేక్ ముస్లింలు (7.9 శాతం) అత్యధిక జనాభాతో ముందుండగా, ముదిరాజ్ (7.4 శాతం), యాదవ (5.7 శాతం), గౌడ్ (4.6 శాతం), మున్నూరుకాపు (3.9 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఎస్సీ వర్గాల్లో: మాదిగ (10.3 శాతం) సామాజిక వర్గం అత్యధిక జనాభా కలిగి ఉండగా, మాల (4.1 శాతం), బేడా (0.5 శాతం), మాల సేల్ (0.5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఎస్టీ వర్గాల్లో: లంబాడీలు 6.8 శాతం జనాభాతో అగ్రస్థానంలో నిలిచారు. కోయ (1.2 శాతం), గోండ్ (1.1 శాతం), ఎరుకుల (0.5 శాతం) వారి తర్వాత ఉన్నారు.

ఈ సర్వే ద్వారా వెల్లడైన గణంకాలు భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల రూపకల్పన, రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Telangana Caste Survey
Telangana caste survey
SEEEPC survey
BC population Telangana
Madiga caste
Sheikh Muslims Telangana
Mudiraj caste
Telangana population by caste
Reddy caste Telangana
Lambadi population

More Telugu News