పిల్లలే నా గుండె చప్పుడు: తండ్రిగా తన బాధ్యతలపై రామ్ చరణ్ ఎమోషనల్
- పిల్లలు మట్టిలో ఆడుకున్నా ప్రోత్సహిస్తానన్న చరణ్
- పిల్లలు ఇంట్లో లేకపోతే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుందని వ్యాఖ్య
- తన తండ్రిని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని వెల్లడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా 'ఎస్క్వైర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లలు, కుటుంబం పట్ల తనకున్న ప్రేమని పంచుకున్నారు. 2023లో చరణ్ దంపతులకు క్లిన్ కారా జన్మించింది. ఈ ఏడాది జనవరిలో కవలలు శివ రామ్, అన్వీర దేవి రావడంతో మెగా ఇంట సందడి నెలకొంది.
చరణ్ తనను తాను కాస్త 'రఫ్' తండ్రిగా అభివర్ణించుకున్నారు. "పిల్లలు మట్టిలో ఆడుకున్నా, రిస్కులు తీసుకున్నా నేను ప్రోత్సహిస్తాను. వాళ్ల అమ్మ ప్రేమను అందిస్తే, ధైర్యం కోసం వారు నా దగ్గరకు వస్తారు" అని చెప్పుకొచ్చారు. తన ముగ్గురు పిల్లలే తన ప్రపంచమని, వారు ఇంట్లో లేకపోతే తన గుండె చప్పుడు ఆగిపోయినట్లుగా అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యారు.
స్టార్‌డమ్ ఎంత ఉన్నా, పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన తండ్రి చిరంజీవిని చూసి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని... పెంపుడు జంతువులు, కుటుంబమే తన చిన్న ప్రపంచమని చరణ్ స్పష్టం చేశారు.
వృత్తిపరంగా చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' చిత్రంపై దృష్టి సారించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.