పీఎస్‌ఎల్‌లో కొత్త వివాదం.. బౌలర్ తారిఖ్ యాక్షన్‌పై డారిల్ మిచెల్ నిరసన.. అశ్విన్ ఐడియా ఫాలో అయ్యాడా?

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఒక కొత్త వివాదం తెరపైకి వచ్చింది. క్వెట్టా గ్లాడియేటర్స్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వింత బౌలింగ్ యాక్షన్‌పై న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. బౌలర్ యాక్షన్‌ను నిరసిస్తూ పలుమార్లు బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ ఘటన నిన్న రావల్పిండి వేదికగా జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
రావల్పిండి జట్టు ఛేదన చేస్తున్న సమయంలో మధ్య ఓవర్లలో ఈ ఘటన జరిగింది. క్వెట్టా స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ చేసేందుకు పరుగెత్తుకొచ్చి, బంతి వేయడానికి ముందు తనదైన శైలిలో కాసేపు ఆగి మళ్లీ కొనసాగించ‌డం చేశాడు. ఇదే అతని ప్రత్యేకత. అయితే, తారిఖ్ ఇలా ఆగిపోవడం తన టైమింగ్‌ను, ఏకాగ్రతను దెబ్బతీస్తోందని మిచెల్ అసహనం వ్యక్తం చేశాడు. బౌలర్ బంతి వేయబోతున్న సమయంలో స్టంప్స్ నుంచి పక్కకు తప్పుకుని, తాను సిద్ధంగా లేనని అంపైర్‌కు సంకేతాలిచ్చాడు. ఒకే ఓవర్లో పలుసార్లు ఇలా చేయడంతో ఆట కాసేపు ఆగింది. ఈ పరిణామంపై వ్యాఖ్యాతగా ఉన్న రమీజ్ రాజా సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిచెల్ ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.

అశ్విన్ ఐడియానే కారణమా?
డారిల్ మిచెల్ నిరసన వెనుక భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆలోచన ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే అశ్విన్, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధతపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక బౌలర్ బంతి వేసే ముందు ఇలా విచిత్రంగా ఆగడం వల్ల బ్యాటర్ దృష్టి మరలితే, నిబంధనల ప్రకారం బ్యాటర్ క్రీజు నుంచి తప్పుకోవచ్చని సూచించాడు. అశ్విన్ చెప్పిన ఈ వ్యూహాన్నే మిచెల్ మైదానంలో అమలు చేసినట్లుగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మిచెల్ నిరసనతో అంపైర్లు, క్వెట్టా కెప్టెన్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

అయితే, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే క్రికెట్‌ నిబంధనలకు లోబ‌డే ఉన్న‌ట్లుగా గుర్తించింది. దీంతో అంపైర్లు అతనికి ఎలాంటి హెచ్చరిక జారీ చేయకుండానే బౌలింగ్ కొనసాగించేందుకు అనుమతించారు. ఈ ఘటనతో క్రికెట్‌లో నిబంధనల వినియోగం, క్రీడాస్ఫూర్తిపై మరోసారి కొత్త చర్చ మొదలైంది.

Daryl Mitchell
Usman Tariq
PSL 2026
Pakistan Super League
R Ashwin
Ravichandran Ashwin
Quetta Gladiators
Bowling Action Controversy
Cricket Rules
Rawalpindi

More Telugu News