సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు.. డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా!

Mangli Faces Criminal Case Allegations of Cheating and Threats
షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల్లో తన జానపద, సినీ గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రమైన ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడుల పేరుతో మోసం చేయడమే కాకుండా బాధితుల తరపున ప్రశ్నించిన న్యాయవాదిని చంపేస్తామని బెదిరించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, 'విరాటపర్వం' ఫేమ్ డైరెక్టర్ వేణు ఉడుగుల పేర్లు కూడా ఉండటం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమందితో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు 100 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నెలలు గడుస్తున్నా బాధితులకు ఎలాంటి లాభాలు గానీ, కనీసం అసలు డబ్బు గానీ తిరిగి చెల్లించలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు.

బాధితుల తరపున రంగంలోకి దిగిన న్యాయవాది సుబ్బారావు, చెల్లించాల్సిన డబ్బుల గురించి మంగ్లీ బృందాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తనకు తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారని తెలిపారు. "యాక్సిడెంట్ చేయించి చంపేస్తాం" అంటూ వారు తనను బెదిరించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు లభించడంతో మంగ్లీ, శివ, వేణు ఉడుగులతో పాటు మరికొందరిపై చీటింగ్, బెదిరింపుల కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వరుస అవకాశాలతో కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న మంగ్లీపై ఇలాంటి క్రిమినల్ ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.


Go Back to Shorts
Singer Mangli
Mangli case
Venu Udugula
Singer Mangli
Investment fraud
Cheating case
Panjagutta police
Virata Parvam director
Advocate Subbarao
Telugu states

More Telugu News