నవ రాయ్‌పూర్‌ను ఉదాహరణగా చూపుతూ అమరావతిపై సజ్జల విమర్శలు

Sajjala Criticizes Amaravati Cites Nava Raipur Example
షార్ట్స్‌లో చూడండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మిస్తున్న అమరావతి రాజధాని 40 ఏళ్లయినా పూర్తికాదని, అదొక అసాధ్యమైన ఆలోచన అని వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌ను ఉదాహరణగా చూపుతూ, అక్కడ కేవలం భవనాలు మాత్రమే ఉన్నాయి తప్ప జనం లేరని, అమరావతి పరిస్థితి కూడా అలాగే మారుతుందని ఆయన హెచ్చరించారు.


కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల కోసం విలాసవంతమైన బంగ్లాలు కడుతున్నారే తప్ప, సామాన్య ప్రజలు అక్కడ నివసించే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయిలో రేట్లు పెట్టి... ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోటికి ప్రజలు ఎందుకు వస్తారని సజ్జల ప్రశ్నించారు.


చంద్రబాబు అమరావతిని ఒక 'గ్రోత్ ఇంజిన్'లా కాకుండా, తన అవినీతికి తరగని గనిలా, అక్షయపాత్రలా వాడుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడం భావితరాలకు అన్యాయం చేయడమేనని మండిపడ్డారు. 


తన సొంత సంస్థ హెరిటేజ్‌ను నడిపేటప్పుడు తీసుకునే ఆర్థిక జాగ్రత్తలను, రాజధాని నిర్వహణలో చంద్రబాబు ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. అప్పుల ద్వారా వచ్చే నిధులతో ఆకాశహర్మ్యాలు కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందో చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారని, ఆయన మాటల్లో డొల్లతనం కనిపిస్తోందని విమర్శించారు.


మరోవైపు వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధాని గురించి సజ్జల ప్రస్తావిస్తూ, అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10 శాతంతోనే మరుసటి రోజు నుంచే పూర్తిస్థాయి రాజధానిగా మార్చవచ్చని తెలిపారు. మావిగన్ ప్రాంతం అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ, పోర్టుతో అనుసంధానం అయిందని, అక్కడ పెట్టుబడి పెడితే తక్షణమే ఫలితం ఉంటుందని వివరించారు. 


రాష్ట్ర వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నదే జగన్ ఆలోచన అని, కానీ చంద్రబాబు కేవలం భ్రమలు సృష్టిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వృథా ఖర్చులను ఆపి, ఆచరణాత్మకమైన రాజధాని వైపు అడుగులు వేయాలని సజ్జల సూచించారు.

Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
Nava Raipur
Capital City
Real Estate
Mavigan
YSRCP
Debt

More Telugu News