సిలిండర్ పేలుడు: రూ.3 లక్షల నగదు, తులం బంగారం బూడిద

కర్నూలు జిల్లా ఆలూరులో పెను విషాదకర ఘటన జరిగింది. ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో బీరువాలో దాచిన రూ.3 లక్షల నగదు, తులం బంగారం అగ్నికి ఆహుతి అయ్యాయి. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే, ఆలూరుకు చెందిన చాంద్ బాషా, షాహిదా దంపతులు నివసిస్తున్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడాన్ని షాహిదా గమనించింది. వెంటనే అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఆమె బయటకు వచ్చిన కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో ఆమె భర్త చాంద్ బాషా ఇంట్లో లేరు.

ఈ పేలుడు ధాటికి మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.3 లక్షల నగదు, తులం బంగారం పూర్తిగా కాలిపోయాయి. ఇతర విలువైన వస్తువులు కూడా మంటల్లో దగ్ధమయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Chand Basha
Kurnool district
Alur
Gas cylinder blast
Fire accident
Andhra Pradesh news
Gold
Cash

More Telugu News