వదినపై రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసిన నటి హన్సిక

ప్రముఖ సినీ నటి హన్సిక మోత్వాని, తన వదిన, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా వేశారు. తనపై, తన సోదరుడు ప్రశాంత్ మోత్వానిపై ముస్కాన్ గృహ హింస ఆరోపణలు చేయడంతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ హన్సిక ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది అద్నాన్ షేక్ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ ప్రకారం తన సోదరుడు ప్రశాంత్‌తో వివాహ సమయంలో ముస్కాన్ రూ.27 లక్షలు అప్పుగా తీసుకున్నారని, దాన్ని తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడానికే సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హన్సిక పేర్కొన్నారు. తన సోదరుడి వైవాహిక జీవితంతో తనకు పరిమిత ప్రమేయం మాత్రమే ఉందని, వారు నివసించే ఇంట్లో తాను లేనని స్పష్టం చేశారు.

గతంలో ముస్కాన్.. తన భర్త ప్రశాంత్‌తో పాటు హన్సికపై కూడా వేధింపులు, గృహ హింస ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో ఖరీదైన బహుమతులు డిమాండ్ చేశారని, వారి వేధింపుల వల్లే తనకు బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వచ్చిందని ఆమె ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. ఈ ఆరోపణలను హన్సిక పూర్తిగా ఖండించారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆమె గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

తాజా పరువునష్టం దావాలో భాగంగా ముస్కాన్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఆమెను నిలువరించాలని కోర్టును హన్సిక కోరారు. సివిల్ దావాతో పాటు, భారతీయ న్యాయ సంహిత కింద అంధేరిలోని మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువునష్టం కేసు కూడా దాఖలు చేశారు. ప్రశాంత్, ముస్కాన్ 2020లో వివాహం చేసుకోగా, 2022 నుంచి విడిగా ఉంటున్నారు. దిండోషి సెషన్స్ కోర్టులో ఈ పరువునష్టం దావా త్వరలో విచారణకు రానుంది.

Hansika Motwani
Muskaan Nancy James
defamation case
domestic violence allegations
Prashant Motwani
Bombay High Court
Bells Palsy
Mumbai Sessions Court
celebrity news
Indian Penal Code

More Telugu News