జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని, వ్యక్తిత్వంతో, విలువలతో జాతి నిర్మాణంలో భాగస్వామిగా నిలిచిన భారతీయ వారసత్వ సంపదకు ప్రతీక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'మెగా కల్చరల్ ఫెస్ట్ 2026'లో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఘనతను స్మరించుకున్నారు.

ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ ఈ స్థాయిలో ఉందంటే, ఎందరో విద్యార్థులు ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరడమే నిదర్శనమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ సీఆర్ రెడ్డికి, ఆయన ఆశయానికి అండగా నిలిచిన మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు, రామన్ ఎఫెక్ట్‌తో నోబెల్ బహుమతి సాధించిన సర్ సీవీ రామన్‌కు మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు తెలిపారు.

1926లో ఉన్నత విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, జాతి నిర్మాణం అనే మూడు మూల స్తంభాలపై ఏయూని స్థాపించారని గుర్తుచేశారు. ఇక్కడ చదువుకున్న వారు కేవలం ఉద్యోగాలు వెతుక్కోకుండా, వివిధ రంగాలలో సమాజాన్ని ముందుకు నడిపించే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలలో మార్పు తెచ్చే శక్తిగా నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుత విద్యార్థులు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు.

తనకు అత్యంత ఆప్తుడైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే ఆంధ్రా యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయ్యారని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆయన ద్వారానే ఇక్కడి ప్రొఫెసర్ల ప్రతిభ, వర్సిటీ గొప్పదనం గురించి తనకు తెలిసిందని, ఇంతటి గొప్ప విశ్వవిద్యాలయానికి అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 

"నేను చాలా తక్కువ మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. కానీ ఎంత మౌనంగా ఉండాలనుకున్నా, జీవితం నన్ను కోట్లాది మంది మధ్య మాట్లాడేలా చేసింది" అంటూ ప్రసంగించారు. ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నా, తరతరాలకు ప్రత్యేకమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నత స్థానంలో నిలిచిన వాటిలో ఏయూ ఒకటని కొనియాడారు.

Pawan Kalyan
Andhra University
AU Centenary Celebrations
Visakhapatnam
Trivikram Srinivas
Dr CR Reddy
Sarvepalli Radhakrishnan
Sir CV Raman
Mega Cultural Fest 2026
Education

More Telugu News