హైదరాబాదులో... ఏసీబీ వలకు చిక్కిన ఇద్దరు ఎయిర్ పోర్టు పోలీసు అధికారులు

ACB Raids Hyderabad Airport Police Station Two Arrested
షార్ట్స్‌లో చూడండి
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పోలీస్ అవుట్‌పోస్ట్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఓ కేసులో సహాయం చేసేందుకు లంచం తీసుకుంటున్న ఒక ఇన్‌స్పెక్టర్, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో చార్జిషీట్ వేయడానికి, ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులను ఇరికించకుండా ఉండేందుకు ఇన్‌స్పెక్టర్ సంపత్ కనకయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్ యు.కె. సిద్ధేశ్వర్ రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంటుండగా, రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు.

ఈ ఆపరేషన్ తర్వాత ఇన్‌స్పెక్టర్ కనకయ్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా భారీగా నగదు బయటపడింది. ఆయన ఇంట్లో రూ. 33.97 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా లభించాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని ఏసీబీ తెలిపింది.

విధులను దుర్వినియోగం చేసి అక్రమ లబ్ధి పొందారనే ఆరోపణలపై ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. కాగా, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను ఏసీబీ గోప్యంగా ఉంచింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, టోల్-ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మంగళవారం కూడా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ గోవర్ధన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీడ్ లైసెన్సు కోసం రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు.
Go Back to Shorts
Sampath Kanakaiah
Rajiv Gandhi International Airport
RGIA
Hyderabad ACB Raid
bribery case
airport police corruption
UK Siddeshwar
Nampally ACB Court
Telangana Anti Corruption Bureau

More Telugu News