మే నుంచి హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. 1% వరకు భారం!

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ముడిసరుకులు, ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. పెంచిన ధరలు 2026 మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో అన్ని మోడళ్లపై గరిష్టంగా 1 శాతం వరకు భారం పడనుంది.

ఈ ఏడాదిలో హ్యుందాయ్ తమ వాహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాల భారాన్ని వీలైనంత వరకు తామే భరిస్తున్నామని వెల్లడించిన కంపెనీ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ స్వల్ప పెంపును వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెరుగుదలలో తేడాలు ఉంటాయని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఉక్కు, అల్యూమినియం వంటి కీలక లోహాల ధరలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో ఇతర కార్ల కంపెనీలు కూడా ధరల పెంపు దిశగా యోచిస్తున్నాయి. కాగా, హ్యుందాయ్ ఇటీవలే మార్చి నెలలో 55,064 యూనిట్ల విక్రయాలతో అత్యధిక దేశీయ అమ్మకాలను నమోదు చేయడం విశేషం.

Hyundai
Hyundai Motors India
Car price hike
Automobile industry
Indian auto market
Car prices India
Hyundai sales
Raw materials cost
Auto industry news
Vehicle price increase

More Telugu News