మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను: పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య అభివృద్ధిపై మొదలైన మాటల యుద్ధం మరింత ముదిరింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో, స్పష్టమైన గణాంకాలతో బదులిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. తాను గౌరవప్రదంగా విమర్శలు చేసినప్పటికీ, విజయన్ మాత్రం అమర్యాదకరమైన భాషను ఉపయోగించారని రేవంత్ ఆక్షేపించారు. "మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను" అంటూ చురక అంటించిన ఆయన, మీరు మా రాష్ట్రానికి వచ్చినప్పుడు అతిథికి ఇవ్వాల్సిన పూర్తి గౌరవం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు, ఇదే నా చివరి స్పందన అంటూ రేవంత్ రెడ్డి తన లేఖను ఎక్స్ లో పంచుకున్నారు.

పాత లెక్కలు కాదు... కొత్తవి చూడండి

తెలంగాణ ప్రస్తుత పనితీరుపై తీర్పు ఇవ్వడానికి పినరయి విజయన్ 2023-24 నాటి నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీని ఉటంకించడంపై రేవంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సూచీ పదేళ్ల బీఆర్ఎస్-బీజేపీ పాలన చివరి రోజులను ప్రతిబింబిస్తుందని, 28 నెలల క్రితం 2023 డిసెంబరులో ఆ పాలన ముగిసిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ పనితీరును కొత్త గణాంకాలతో అంచనా వేయాలని ఆయన సవాలు విసిరారు. 

"2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్‌డీపీ రూ. 16.12 లక్షల కోట్లకు చేరింది. జాతీయ సగటు 9.9 శాతం ఉండగా, తెలంగాణ వృద్ధి రేటు 10.1 శాతంగా నమోదైంది. ఆర్బీఐ స్టాటిస్టిక్స్ 2024-25 నివేదిక ప్రకారం, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.87 లక్షలకు పెరిగింది. ఈ విషయంలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చివరకు కేరళను కూడా అధిగమించి దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది" అని రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టంగా వివరించారు. 

కేరళ సాధించిన విజయాలు కొన్ని దశాబ్దాల కృషి ఫలితమని అంగీకరిస్తూనే, ప్రత్యేకంగా విజయన్ హయాంలో ఏం జరిగిందో అక్కడి ప్రజలకు వివరించాలని హితవు పలికారు.

పేదరిక నిర్మూలన, అవినీతిపై సూటి ప్రశ్నలు

2025 చివరి నాటికి కేరళ తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా అవతరిస్తుందని విజయన్ చేసిన ప్రకటనను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. "ఇప్పుడు ఏప్రిల్ 2026 నడుస్తోంది. ఇంకా 64,006 కుటుంబాలకు మైక్రో-ప్లాన్‌లు అందుతున్నాయని మీరే లేఖలో చెబుతున్నారు. మరి తీవ్ర పేదరికం నిజంగా నిర్మూలించబడిందా? నవంబర్ 1, 2025 నాటి మీ ప్రకటనను ఏదైనా స్వతంత్ర సంస్థ ధృవీకరించిందా?" అని నిలదీశారు. 

నీతి ఆయోగ్ అవినీతి ర్యాంకింగ్స్‌ను తాను గౌరవిస్తానని, కానీ కేరళ నిజంగానే అవినీతి రహిత రాష్ట్రమైతే ముఖ్యమంత్రి కార్యాలయంతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. అలాగే, శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి మాయమైనట్లు ఆరోపణలున్న 4.5 కిలోల బంగారం లెక్క తేలలేదని గుర్తుచేశారు.

మాది 'తెలంగాణ రైజింగ్' విజన్

తమ ప్రభుత్వ దార్శనికతను వివరిస్తూ.. 'తెలంగాణ రైజింగ్' తమ లక్ష్యమని రేవంత్ పేర్కొన్నారు. దశాబ్దంలో రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ధ్యేయమన్నారు. హైదరాబాద్ సమీపంలో 'ఫ్యూచర్ సిటీ', జహీరాబాద్‌లో 'నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్' ఈ లక్ష్య సాధనకు మూలస్తంభాలుగా నిలుస్తాయని తెలిపారు. కేరళలో రాబోయే కొత్త ప్రభుత్వం 'నవ కేరళం' విజన్‌ను అమలు చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని, త్వరలోనే అక్కడి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారంటూ విజయన్‌కు చురకలు అంటించారు.



Revanth Reddy
Pinarayi Vijayan
Telangana
Kerala
State Development
GSDP Growth
Poverty Eradication
Corruption Allegations
NITI Aayog
Telangana Rising

More Telugu News