తెలంగాణ కూతురుగా చెబుతున్నా..!: కేరళ ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని విశ్వసించవద్దని, పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. "జై తెలంగాణ, జై కేరళ" అంటూ ప్రారంభించారు. "తెలంగాణ కూతురిగా కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ వీడియోను విడుదల చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని నమ్మించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో వారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, కానీ కేవలం సగం గ్యారెంటీ 'ఉచిత బస్సు'ను మాత్రమే అమలు చేశారని పేర్కొన్నారు. తాను తెలంగాణ బిడ్డనని, త్వరలో రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కేరళ ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఆడపడుచులకు నెలకు రూ.2,500, యువతకు ఉద్యోగాలు, రైతులకు బోనస్, పెన్షన్ పెంపు వంటి హామీలు ఇచ్చి కూడా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. అవినీతి ద్వారా తెలంగాణ నుంచి వచ్చిన సొమ్మును కాంగ్రెస్ కేరళలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్డీఎఫ్‌కు ఓటు వేయాలని కోరారు.

Kalvakuntla Kavitha
Kavitha
Telangana
Kerala
Revanth Reddy
Congress Party
LDF
Pinarayi Vijayan

More Telugu News