కిడ్నీ ఇవ్వు లేదా రూ.30 లక్షలు తీసుకురా.. భార్యకు అత్తింటి నరకం!

వరకట్న వేధింపులు ఎంతటి దారుణ స్థాయికి చేరాయో తెలియజేసే ఒక అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది. తన భర్త రెండు కిడ్నీలూ పాడైన విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని, ఇప్పుడు చికిత్స కోసం రూ.30 లక్షలు తీసుకురావాలని లేదా తన కిడ్నీని దానం చేయాలని అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన యువతికి, లక్నోకు చెందిన నిశాంత్ కుమార్‌తో 2023 జూన్ 22న వివాహం జరిగింది. 

పెళ్లి సమయంలో ఆమె కుటుంబం రూ.8 లక్షల నగదు, విలువైన నగలతో పాటు మహీంద్రా థార్ కారును కట్నంగా ఇచ్చింది. పెళ్లయిన తర్వాత భర్త రోజూ పదికి పైగా మాత్రలు వేసుకోవడం గమనించిన ఆమె, అత్తింటివారిని ప్రశ్నించగా రక్తపోటు ఉందని అబద్ధం చెప్పారు. అనుమానం వచ్చిన ఆమె ఇంట్లో వెతకగా భర్తకు సంబంధించిన మెడికల్ ఫైల్ దొరికింది. వ్యసనాల కారణంగా 2022లోనే అతని రెండు కిడ్నీలు పాడయ్యాయని, అప్పటి నుంచి డయాలసిస్‌పై ఉన్నాడని తెలుసుకుని ఆమె షాక్‌కు గురైంది.

ఈ విషయాన్ని నిలదీయడంతో ఆమెపై అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. ‘నీ భర్త బతకాలంటే మీ పుట్టింటి నుంచి రూ.30 లక్షలు తీసుకురా, లేదంటే నీ కిడ్నీని అతడికి దానం చెయ్యి’ అని ఒత్తిడి చేశారని తెలిపింది. తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా తెలుసని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. గత ఏడాది అక్టోబరులోనే అత్తింటి నుంచి తాను బయటకు రాగా.. తన నగలన్నీ వారే ఉంచుకున్నారని ఆరోపించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు చాకేరి పోలీసులు నిశాంత్ కుమార్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, మోసం, క్రూరత్వం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి అభిషేక్ పాండే తెలిపారు.

Nishant Kumar
dowry harassment
kidney transplant
Uttar Pradesh
Kanpur
crime news
domestic violence
police investigation
medical fraud

More Telugu News