అమరావతి అజేయంగా వెలుగొందుతుంది: బాలకృష్ణ భావోద్వేగ సందేశం!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదించడం, కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక క్షణమని బాలకృష్ణ పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, మన రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతీక అని ఆయన అన్నారు. 


అమరావతి రైతుల సహనం, త్యాగం, నిబద్ధత వల్లే ఈ రోజు ఈ చారిత్రాత్మక క్షణం సాధ్యమైందని, ఇది వారి విజయమని కొనియాడారు. అమరావతి కోసం ఎన్నో కష్ట నష్టాలు ఎదొ ర్కొని మొక్కవోని దీక్షతో స్ఫూర్తి దాయకమైన పోరాటం చేసిన అమరావతి ప్రాంత ఆడపడుచులకు, వారికి అన్నివిధాల సహకరించిన వారికి, మీడియా మిత్రులకు, ప్రతిఒక్కరికి తన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కి చట్టపరమైన గుర్తింపు లభించడం చరిత్రలో సువర్ణక్షారాలతో లఖించదగిన ఘట్టమని అన్నారు. రాజధాని కల సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు ధన్యవాదాలు చెప్పారు.


ఈ చట్టబద్ధమైన గుర్తింపుతో అమరావతిపై పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కలుగుతుందని... ఇకపై రాజధాని అజేయంగా, అజరామరంగా వెలుగొందుతుందని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. మనందరం కలిసి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని, భావి తరాల కలలను నిజం చేద్దామని పిలుపునిచ్చారు. ఇక యావన్మంది ఆంధ్రులు సగర్వంగా... మా రాజధాని అమరావతి అని చాటుకోవచ్చని అన్నారు.  "జై ఆంధ్రప్రదేశ్ – జై అమరావతి" అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.


Nandamuri Balakrishna
Amaravati
Andhra Pradesh
Droupadi Murmu
Chandrababu Naidu
AP Capital
AP Politics
Amaravati Farmers
Central Government
Capital City

More Telugu News