Amy Jones: ఆసీస్ మహిళా క్రికెటర్ ను పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్!

Amy Jones Marries Australian Cricketer Pippa Cleary
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ అమీ జోన్స్ ఓ ఇంటివారయ్యారు. తన చిరకాల ప్రేయసి, ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్ పీపా క్లియరీని ఆమె వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 4న పశ్చిమ ఆస్ట్రేలియాలో వీరి వివాహం జరిగింది. ఈ విషయాన్ని అమీ జోన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "04.04.26 – ది బెస్ట్ డే" అనే క్యాప్షన్‌తో పెళ్లి ఫొటోలను పంచుకున్నారు.

మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో పెర్త్ స్కార్చర్స్‌ జట్టుకు ఆడుతున్న సమయంలో అమీ జోన్స్, పీపా క్లియరీ మధ్య పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారడంతో 2022 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. గత ఏడాది జులైలో వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇంగ్లండ్‌లోని లఫ్‌బరోలో కలిసి నివసిస్తున్నారు.

వీరి వివాహ వేడుకకు ఇంగ్లండ్ క్రికెటర్లు నాట్ సివర్-బ్రంట్, కేథరిన్ బ్రంట్ బ్రైడ్స్‌మెయిడ్స్‌గా హాజరవడం విశేషం. ఇటీవలి కాలంలో మహిళా క్రికెట్‌లో స్వలింగ వివాహాలు సాధారణమయ్యాయి. ఇప్పటికే నాట్ సివర్-కేథరిన్ బ్రంట్ (ఇంగ్లండ్), డేన్ వాన్ నికెర్క్-మరిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా) వంటి పలువురు స్టార్ క్రికెటర్లు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అమీ జోన్స్ ఇంగ్లండ్ జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతుండగా, పీపా క్లియరీ ఆస్ట్రేలియా దేశవాళీ సర్క్యూట్‌లో బౌలర్‌గా రాణిస్తున్నారు.
Go Back to Shorts
Amy Jones
Amy Jones wedding
Pippa Cleary
England women's cricket
Australia domestic cricket
same sex marriage
Nat Sciver-Brunt
Katherine Brunt
WBBL
women's cricket

More Telugu News