Nara Lokesh: కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. సైనిక్ స్కూల్ ప్రారంభం.. తెలుగువారికి అండగా ఉంటామన్న లోకేశ్‌

కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో ఇవాళ  ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌లతో కలిసి ఆయన పలు అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోసళ్లీ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకకు లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో కలిసి ఆయన సైనిక్ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

అంతకుముందు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు నిర్వాహకులు, స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన లోకేశ్, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దివంగత డాక్టర్ దండమూడి రాధాకృష్ణ జ్ఞాపకార్థం నిర్మించిన 'డా. రాధాకృష్ణ కళాధామ' ఓపెన్ ఆడిటోరియంను వర్చువల్‌గా ప్రారంభించారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తెలుగు వారికి అండగా ఉంటామని భరోసా
అనంతరం సింధనూరు గంగావతి రోడ్డులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్‌లతో కలిసి మంత్రి లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.

"చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన క్లిష్ట సమయంలో సింధనూరు, రాయచూర్‌లోని తెలుగు ప్రజలు మాకు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడికి వచ్చాను. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది" అని లోకేశ్ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి లోకేశ్‌ను స్థానిక తెలుగు సంఘం నాయకులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమాల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్, కర్ణాటక మంత్రులు శరణ్ ప్రకాశ్ పాటిల్, శివరాజ్ తంగడగి, ఎన్.ఎస్. బోసురాజు, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లీ, శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ బి.వెంకటరావు, సంస్థ డైరెక్టర్లు, స్థానిక తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Nara Lokesh
Sindhanur
NTR statue
Sri Krishnadevaraya Sainik School
Karnataka
Rayachur
Telugu community
Chandrababu Naidu arrest
HD Kumaraswamy
Visakha MP Sri Bharat

More Telugu News